మోదీ సర్కారుపై ముఫ్తి ఫైర్‌

5 Aug, 2019 12:21 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో నేడు ఒక దుర్దినం అని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఈ మేరకు...‘ 1947లో (దేశ విభజన సమయంలో) భారత కూటమిలో చేరుతూ జమ్మూ కశ్మీర్‌ నాయకత్వం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. జమ్మూ కశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు అవకాశం కల్పించారు. భారత ప్రజాస్వామ్యంలో నేడు చీకటి రోజు’ అని ముఫ్తి ట్వీట్‌ చేశారు. ఇక ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌లో భారీగా బలగాలను మోహరించిన కేంద్రం.. తాజా నిర్ణయాల నేపథ్యంలో మరో 8 వేల బలగాలను శ్రీనగర్‌కు పంపింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

చదవండి : కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాగా ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేస్తూ పలు వివరాలు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌ను మూడు ముక్కలు చేసేలా జమ్మూ, కశ్మీర్‌, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లడఖ్‌ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రజలు కోరుతున్నారని అమిత్‌ షా చెప్పారు. ఇక కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు