ఇమ్రాన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి : మెహబూబా 

20 Feb, 2019 20:04 IST|Sakshi
మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఓ అవకాశం ఇవ్వండని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పుల్వామా దాడికి సంబంధించిన సాక్ష్యాలుంటే ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఇమ్రాన్‌ సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మెహబూబా మీడియాతో మాట్లాడుతూ.. పఠాన్‌కోట్‌, ముంబై దాడులకు సంబంధించి పాక్‌కి ఆధారాలు సమర్పించినా అప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ పదవిలో లేరని, ఆయనకో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్నది సరికొత్త పాకిస్తాన్‌ అని ఇమ్రాన్‌ఖాన్‌ చెబుతున్నారని కాబట్టి.. ఆయనకు ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఫ్తీ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 మంది భారత సైనికులను బలిగొన్న దేశానికి మద్దతు తెలుపుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జేఎన్‌యూ ఫ్రొఫెసర్‌ అమితా సింగ్‌ అయితే ఏకంగా ఈ ఉగ్రదాడికి మెహబూబానే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రజా వాహనాలను నిలువరించే విషయంలో ముఫ్తీ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ ఉగ్ర దాడి జరిగిందని ట్వీట్‌ చేశారు. ‘‘ఆర్‌డీఎక్స్ నింపిన వాహనాన్ని అధికారులు పరీక్షించే అవకాశం లేకుండా మెహబూబా ముఫ్తీ ఆ మార్గంలోని మూడు చెక్ బ్యారియర్లను తొలగించారు. గవర్నర్ గారూ.. దయచేసి ఆమె తొలగించిన అన్నిటినీ మళ్లీ పునరుద్ధరించండి. 40 మంది సైనికులు చనిపోయారన్న బాధ నిజంగా మెహబూబా ముఫ్తీకి ఉంటే.. తన పొరపాటుకు పరిహారంగా 40 మంది తన మద్దతుదారులను బహిరంగంగా ఉరితీసేందుకు అప్పగించాలి...’’ అని పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై మెహబూబా కూడా ఘాటుగానే స్పందించారు. ‘ఉన్నత చదువులు చదివిన ఓ వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? ఆమె నిజంగా చదువుకున్నారా? కశ్మీరీలను వేధించాలన్న ఉద్దేశ్యంతో ఆమె కావాలనే ఈ కట్టుకథలు అల్లుతున్నట్టు కనిపిస్తోంది..’’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లకు ప్రవేశం లేదని ఓ హోటల్‌ యజమాని పెట్టిన బోర్డుపై కూడా మెహబూబా ఘాటుగా స్పందించారు. కశ్మీర్‌పై విద్వేశం పెంచుకొని ఏం సాధిస్తారని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు