70 ఏళ్లుగా తిండి, నీరు లేకుండానే జీవనం..

12 Jun, 2018 11:18 IST|Sakshi

అహ్మదాబాద్‌ : తిండి, నీరు లేకుండా కొన్ని రోజులు జీవించచ్చని తెలుసు.. కానీ ఓ యోగి 70 ఏళ్ల నుంచి అవేమీ తీసుకొకుండానే జీవిస్తున్నారు. అతన్ని అందరు ‘బ్రితేరియన్‌‘ అని పిలుస్తారు. అంటే గాలి పీల్చి బతుకుతాడని అర్థం. గుజరాత్‌లోని మెహసానాకు చెందిన ప్రహ్లాద్‌ జానీ అనే 85 ఏళ్ల యోగి గత ఏడు దశాబ్దల నుంచి ఎటువంటి ఆహారం, నీరు తీసుకొకుండా జీవిస్తున్నారు. అక్కడి వారందరు అతన్ని మాతాజీగా పూజిస్తారు. కేవలం గాలి పీల్చి మాత్రమే తన జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ యోగి జీవన శైలి తెలుసుకోవడానికి ప్రపంచంలోని పలువురు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అతనికి పరీక్షలు జరిపి ఆశ్చర్యపోవడం వారి వంతైంది తప్ప ఏ విషయం గుర్తించలేకపోయారు. అతన్ని స్టడీ చేసిన వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కూడా ఉన్నారు. 

మాతాజీపైనే కాకుండా ఆయన ఆశ్రమంలోని చెట్లపై కూడా పరిశోధనలు జరిపిన నిపుణులు అతని అసాధారణ జీవన విధానాన్ని శోధించలేకపోయారు. 2010లో అతనిపై డీఐపీఏఎస్‌, డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఎంఆర్‌ఐ, అల్ట్రా సౌండ్‌, ఎక్స్‌రేలతోపాటు రకరకాలు పరీక్షలు నిర్వహించారు. చివరకు అతని శరీరంలోని ప్రక్రియలు అతను అలా ఉండటానికి దోహదపడుతున్నాయనే అంచనాకు వచ్చారు. అంబా దేవతను పూజించే మాతాజీ.. ధ్యానం వల్లే తనకు శక్తి సమకూరుతుందని చెప్తారు. తమ బాధలు చెప్పుకోవడానికి చాలా మంది మాతాజీ ఆశ్రమానికి వస్తుంటారు. ప్రధాని​ నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు మాతాజీ  ఆశీస్సులు పొందినవారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు