బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్‌ ఫిదా

26 Feb, 2020 10:43 IST|Sakshi

న్యూఢిల్లీ : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి వచ్చిన ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ మంగళవారం రాత్రి తిరిగి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో తన డ్రెస్సింగ్‌, హావభావాలు, మాట్లాడే తీరుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మెలానియా వెళ్తూ వెళ్తూ ఎన్నో మధుర స్మృతులను తన వెంట తీసుకెళ్లారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని నానక్పూర్‌లో ఉన్న సర్వోదయా ప్రభుత్వ పాఠశాలను అమెరికా ప్రథమ మహిళ  మెలానియా ట్రంప్‌ సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న హ్యాపినెస్‌ విద్యా విధానాన్ని మెలానియా స్వయంగా పరిశీలించారు. క్లాస్‌రూంలో చిన్నారులతో ముచ్చటించిన మెలానియా.. విద్యార్థులు వేసిన సూర్య నమస్కారాలు ఆసక్తిగా తిలకించారు. తరగతి గదిలో టీచర్‌గానూ మారిన మెలానియా  చిన్నారులతో ముచ్చటించారు. (అందరి చూపులు ఆమె వైపే..!)


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల డ్యాన్స్‌ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు. తర్వాత పాఠశాల ఆవరణలో స్టేజ్‌పైన కొంతమంది విద్యార్థినులు పంజాబీ పాటకు నృత్యం చేస్తుండగా మెలానియా విద్యార్థుల పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్‌ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఒక పిల్లాడు యూఎస్‌ జెండాను తన చేతిలో పట్టుకొని బాంగ్రా డ్యాన్స్‌ చేయడం మెలానియాను విశేషంగా ఆకర్షించింది. మెలానియా ఒక గంట పాటు సర్వోదయా స్కూల్‌ విద్యార్థులతో ఆనందంగా గడిపారు. కాగా మెలానియా పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలను ఏఎన్‌ఐ సంస్థ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 'హ్యాపినెస్‌ విద్యా విధానాన్ని' అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. (ట్రంప్‌ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంకా)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా