‘నేతాజీ’ వంద ఫైళ్లు బహిర్గతం

24 Jan, 2016 01:57 IST|Sakshi
‘నేతాజీ’ వంద ఫైళ్లు బహిర్గతం

చరిత్రలో మరిచిపోలేని రోజు: ప్రధాని మోదీ
 
 న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించిన 100 ఫైళ్లను ఆయన 119వ జయంతి సందర్భంగా ప్రధాని  మోదీ ఢిల్లీల్లో బహిర్గతం చేశారు. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఏఐ)లో జరిగిన కార్యక్రమంలో ప్రధానితోపాటు నేతాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బోస్‌పై ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఎన్‌ఏఐ.. ప్రతి నెల 25 కొత్త ఫైళ్లను ఈ వెబ్‌సైట్లో ఉంచాలని భావిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బోస్ కుటుంబ సభ్యులతో సమావేశమైన మోదీ.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శనివారం మోదీ 100 ఫైళ్లను (మొత్తం 16,600 పేజీలు) ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నేతాజీ అదృశ్యంపై గత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన రెండు కమిషన్లు.. 1945 ఆగస్టు 18 తైపీలో జరిగిన విమాన ప్రమాదంలోనే మృతిచెందినట్లు వెల్లడించాయి. కాగా, ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని మూడో కమిటీ మాత్రం విమాన ప్రమాదం తర్వాత కూడా బోసు బతికే ఉన్నారని తెలిపింది. శనివారం బహిర్గతమైన 100 ఫైళ్లలో ప్రధాని కార్యాలయం నుంచి 36, హోంశాఖ నుంచి 18, విదేశాంగ వ్యవహారాలనుంచి 46 ఫైళ్లున్నాయి.

 ఏడు దశాబ్దాల తర్వాత: నేతాజీ బంధువులు
 మోదీ చొరవపై బోస్ బంధువులు సంతృప్తి వ్యక్తం చేశారు. ‘చాలా సంతోషం. ఈ దిశగా మోదీ తీసుకున్న చొరవను స్వాగతిస్తున్నాం. చరిత్రలో ఇది పారదర్శకమైన రోజు. రష్యా, జర్మనీ, యూకే, యూఎస్‌లలో ఉన్న ఆధారాలను తీసుకురావటంపై  మోదీ సర్కారు చొరవతీసుకోవాలి’ అని బోస్ మనవడు సుభాష్ కుమార్ తెలిపారు. ఈ అద్భుతమైన సమయం కోసం బోసు కుటుంబం ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోందని నేతాజీ అల్లుడు అర్ధేందు బోస్ తెలిపారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన ఫైళ్లను మరింత ముందుగానే బహిర్గతం చేసుంటే బాగుండేదని మరికొందరు కుటుంబ సభ్యులు కొందరు అభిప్రాయపడ్డారు.  ఇందులో మోదీ చేసిందేమీ లేదని.. జపాన్ పర్యటనలో నేతాజీ అస్థికలున్న రెంకోజీ మందిరాన్ని కూడా ప్రధాని సందర్శించలేదని చారిత్రకవేత్త సుగతా బోస్ (తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ) విమర్శించారు.

 ప్రధాని తీరుపై అనుమానం: కాంగ్రెస్
 ప్రధాని నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేస్తున్న విధానం అనుమానాలకు తావిస్తోందని, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కేంద్ర మాజీమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. అటు, బిహార్ సీఎం నితీశ్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఫైళ్ల బహిర్గతం వెనక నిగూఢ ఎజెండా ఉందని విమర్శించారు. 7 దశాబ్దాలుగా దేశం ఎదురుచూస్తున్న నేతాజీ అదృశ్య రహస్యాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రకటించింది. కోల్‌కతాలో బెంగాల్  సీఎం మమతా బెనర్జీ నేతాజీకి ఘనంగా నివాళులర్పించారు. ఫైళ్ల విడుదలపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. నేతాజీని యుద్ధ నేరస్తుడిగా పేర్కొంటూ.. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీకి రాసిన లేఖ కూడా బహిర్గతమైన వివరాల్లో ఉందన్నారు.

 నేతాజీకి ఘన నివాళి
 సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ‘స్వాతంత్రం వచ్చి ఎన్ని తరాలైనా భారతీయులు నేతాజీ శౌరత్వం, దేశభక్తి, ధైర్యాన్ని మరిచిపోలేదు. అందుకే ఆయన జయంతి సందర్భంగా దేశమంతా బోసుబాబును గుర్తుచేసుకుంటోది. నేతాజీ సూత్రాలను భారతీయులు ఓ బాధ్యతగా తీసుకోవాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించారు. అటు పార్లమెంటు సెంట్రల్ హాల్లోనూ నేతాజీకి పలువురు ప్రముఖులు పుష్పాంజలి అర్పించారు.

 నేతాజీ భారత్‌కు రాకుండా నెహ్రూ అడ్డుపడ్డారు: సుబ్రహ్మణ్య స్వామి
 మైసూరు: చంద్రబోస్ భారత్‌కు రాకుండా జవహార్‌లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. శనివారం మైసూరులో ఆయన మాట్లాడారు. సెంట్రల్ వర్సిటీలో విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యపై స్పందిస్తూ.. శిక్షణ సంస్థలు, వర్సిటీల్లో ఆందోళనలు,ధర్నాలు శృతి మించితే విద్యార్థులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
 ఫైళ్లలో ఏముంది?

 తైపీలోని తైహుకులో 1945లో జరిగిన విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారని భారత ప్రభుత్వం నిర్ధారించింది. 1995 ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ నోట్‌పై అప్పటి కేంద్ర హోం సెక్రటరీ పద్మనాభయ్య సంతకం ఉంది. ‘కొందరు వ్యక్తులు, కొన్ని సంఘాలు నేతాజీ ఇంకా బతికే ఉన్నారని భావిస్తున్నారు. కానీ వాస్తవాలేవీ దీన్ని ధృవీకరించటం లేదు. 1945 ఆగస్టు 18నే నేతాజీ మరణించారని భావిస్తున్నాం’ అని నోట్ పేర్కొంది. వివిధ దర్యాప్తు సంస్థలతో భారత ప్రభుత్వం జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఫైళ్లలో ఉన్నాయి. భారత్-పాక్ మధ్య తాష్కెంట్ ఒప్పందం తర్వాత రష్యన్ రేడియోలో నేతాజీ మాట్లాడారంటూ.. మాజీ ఎంపీ సమర్ గుహ వెల్లడించిన అభిప్రాయాలు ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. బోస్ తైపీ ప్రమాదంలో చనిపోయారనే వార్తలపై బ్రిటీష్ ప్రభుత్వంలో తీవ్రంగా చర్చ జరిగింది. ‘ప్రమాదంలో బోస్ మృతిచెందారని నిర్ధారిస్తున్నాం. దాదాపు 30వేల మందితో ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ఏర్పాటు చేసి.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ’ అని ప్రకటన విడుదల చేసినట్లు ఫైళ్లలో ఉంది.

మరిన్ని వార్తలు