సంసార బంధానికి నీళ్లొదిలారు..

15 Aug, 2018 12:26 IST|Sakshi

వారణాసి : సమాజం తమపట్ల ప్రదర్శిస్తున్న వివక్షను నిరసిస్తూ ఫెమినిజానికి వ్యతిరేకంగా పురుష సమాజం సభ్యులు ఇక్కడి మణికర్ణికా ఘాట్‌లో వివాహ బంధానికి శాస్ర్తోక్తంగా వీడ్కోలు పలికారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పురుషులు ఘాట్‌ వద్ద భేటీ అయ్యారు. పవిత్ర గంగా నదిలో మునిగి తమ వైవాహిక సంబంధాలకు ముగింపు పలికారు. పురుషులు మహిళలకు సంరక్షకులుగా, వారికి సకల సౌకర్యాలను సమకూర్చే యంత్రాలుగా ఉన్న ప్రస్తుత సంప్రదాయ సమాజంలోకి తాము తిరిగి వెళ్లదలుచుకోలేదని ఈ కార్యక్రమానికి హాజరైన సామాజిక కార్యకర్త అమిత్‌ దేశ్‌పాండే పేర్కొన్నారు. తాము సమానత్వాన్ని కోరుతున్నామని, కానీ ప్రస్తుత ఫెమినిజం అందుకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పురుషుల పట్ల వివక్షకు తాము నీళ్లొదిలామని చెప్పారు.తాము పురుషుల హక్కుల కోసం పోరాడుతున్నామని, స్త్రీవాద ఉద్యమంతో పలు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, తాము సమానత్వాన్ని కోరుతున్నామని సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, దామన్‌ వెల్‌ఫేర్‌ సొసైటీకి చెందిన అనుపమ్‌ దూబే అన్నారు. దేశవ్యాప్తంగా వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల పేరుతో పురుషులపై తప్పుడు కేసులు నమోదవుతున్నాయని, మధ్యప్రదేశ్‌లో ఈ తరహా కేసులు ఎక్కువగానమోదయ్యాయ ని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు