పారిపోతాడని సంకెళ్లతో కట్టి తాళం వేస్తే..

26 Feb, 2020 20:39 IST|Sakshi
ఆపరేషన్‌ తర్వాత జితేంద్ర కుమార్‌, ఎక్స్‌రే ఫిల్మ్‌లు (ఇన్‌సెట్‌లో) తాళం

రాంచీ : మతిస్థిమితం లేని వ్యక్తిని బంధించటానికి వేసిన సంకెళ్ల తాళం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. రాంచీ పట్టణానికి చెందిన జితేంద్ర కుమార్‌ అనే యువకుడికి మతిస్థిమితం సరిగాలేదు. తరచుగా ఇంటి నుంచి పారిపోతూ ఉండేవాడు. దీంతో అతడి తల్లిదండ్రులు అతడ్ని సంకెళ్లతో బంధించి తాళం వేశారు. అప్పుడప్పుడు తాళం తీస్తూ ఉండేవారు. కొద్దిరోజుల కిత్రం తాళం తీసిఉన్న సమయంలో అతడు ఆ తాళాన్ని మింగేశాడు. అది కాస్తా గొంతులో అడ్డుపడటంతో ఊపిరి అందక అల్లాడసాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

అతడ్ని పరీక్షించిన డాక్టర్లు తాళాన్ని ఎండోస్కోపీ ద్వారా తీయటానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. తాళాన్ని బయటకు తీయటానికి గొంతుకు ఆపరేషన్‌ చేయటం ఒక్కటే మార్గమని డాక్టర్లు భావించారు. ఫిబ్రవరి 14న జితేంద్రకు ఆపరేషన్‌ నిర్వహించారు. విజయవంతంగా అతడి గొంతులోని తాళాని​ బయటకు తీశారు. 12రోజులు ఆసుపత్రిలో ఉ‍న్న అతడు డిశ్చార్జ్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు