'నితిన్‌ విషయంలో అనుమానించొద్దని కాల్చుకుంది'

26 Dec, 2016 09:16 IST|Sakshi
'నితిన్‌ విషయంలో అనుమానించొద్దని కాల్చుకుంది'

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెర్సిడిస్ కారులో జరిగిన యువతి హత్య కేసు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఆమెను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్న శుభం గుప్తా ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. తాను అసలు ఆమెను చంపనేలేదని తనే కాల్చుకొని చనిపోయిందంటూ విచారణ అధికారుల ముందు చెప్పాడు. అయితే, కేసును తప్పుదోవపట్టించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. కొంత దూరం నుంచే కాల్పులు జరిపినట్లుగా తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వారు తెలిపారు.

కొన్ని రోజుల కిందట స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన సిమ్రన్(17) ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. అనంతరం ఇద్దరితో కలిసి మెర్సిడిస్ కారులో ఇంటి సమీపానికి చేరుకుంది. అక్కడ ఓ యువకుడు కారు దిగి వెళ్లిపోగా కారులోనే ఉన్న శుభం గుప్తా, సిమ్రన్‌ మాత్రమే ఉన్నారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ నితిన్‌తో సిమ్రన్‌ సన్నిహితంగా ఉండటం, అబద్ధాలు చెబుతుండటంపై శుభం ఆమెను ప్రశ్నించాడు. అనంతరం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె తల్లి చూస్తుండగానే అతడు సిమ్రన్‌ను తుపాకీతోనే కాల్చేశాడు. ఆమె చనిపోయింది. పోలీసుల ముందు నేరం కూడా ఒప్పుకున్నాడు.

కానీ, విచారణ అధికారుల ముందు మాత్రం తమ మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత సిమ్రన్‌ తన చేతిలోని తుపాకీ లాక్కొని కాల్చుకొని చనిపోయిందంటూ కొత్తగా చెప్పాడు. తాను నితిన్‌ గురించి అబద్ధం చెప్పడం లేదని ప్రూవ్ చేసుకునేందుకు కాల్చుకుందని తెలిపాడు. తనను నమ్మకుంటే నిజంగానే కాల్చుకొని చనిపోతానని చెప్పిందని, తాను అలా చేస్తుందని ఊహించలేకపోయానంటూ పోలీసులముందు అబద్ధాలు చెప్పాడు. కానీ, శుభం చెప్పేదంతా కట్టుకథేనని, అసలు నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.

మరిన్ని వార్తలు