ఉరిశిక్ష కేసుల్లో క్షమాభిక్షలే ఎక్కువ

2 Sep, 2015 02:19 IST|Sakshi
ఉరిశిక్ష కేసుల్లో క్షమాభిక్షలే ఎక్కువ
  • ఇప్పటివరకు 306 మందికి క్షమాభిక్ష
  • 131 పిటిషన్ల తిరస్కరణ
  •  న్యూఢిల్లీ: మరణశిక్షను రద్దు చేయాలని  దాఖలైన పిటిషన్లలో 306 పిటిషన్లను భారత రాష్ట్రపతులు ఆమోదించి.. పిటిషనర్లకు పడిన మరణశిక్షను రద్దుచేశారు. న్యాయ కమిషన్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం కేసుల్లో మినహా మిగతా కేసుల్లో మరణశిక్షను రద్దు చేయాలని సిఫార్సు చేసిన ఆ నివేదికలో.. 1950 జనవరి 26 నుంచి మంగళవారం వరకూ రాష్ట్రపతులు పరిష్కరించిన క్షమాభిక్ష పిటిషన్ల వివరాలను తెలిపింది. మొత్తం 437 క్షమాభిక్ష దరఖాస్తులు అందగా, వాటిలో 306 పిటిషన్లను ఆమోదించి, వారి మరణశిక్షను జీవితాంతం జైలుశిక్షగా మార్చారని, 131 పిటిషన్లను తిరస్కరించారని వివరించింది. మరణశిక్ష ఎదుర్కొంటున్న దోషి జీవన్మరణాల భవిష్యత్తు.. అప్పటి సర్కారు అభిప్రాయాలపైనే కాకుండా.. రాష్ట్రపతుల వ్యక్తిగత అభిప్రాయాలపై కూడా ఆధారపడి ఉందని పేర్కొంది. వివరాలు..

     

    •   బాబూరాజేంద్రప్రసాద్ 181 క్షమాభిక్ష దరఖాస్తులపై నిర్ణయం తీసుకోగా.. వాటిలో కేవలం ఒక్క దరఖాస్తునే    తిరస్కరించారు.
    •   ఎస్. ధాకృష్ణన్ నిర్ణయం తీసుకున్న 57 దరఖాస్తులనూ ఆమోదించారు.
    •    జాకీర్‌హుస్సేన్, వి.వి.గిరిలు తాము నిర్ణయం తీసుకున్న అన్ని క్షమాభిక్ష పిటిషన్లనూ ఆమోదించారు.
    •   ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డిలు వారి హయాంలో ఏ ఒక్క క్షమాభిక్ష పిటిషన్‌పైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.
    •   1950-1982 మధ్య ఆరుగురు రాష్ట్రపతులు కేవలం ఒకే పిటిషన్‌ను మాత్రమే తిరస్కరించి.. 262 పిటిషన్లను ఆమోదించారు.
    • 1982-1997 మధ్య ముగ్గురు  రాష్ట్రపతులు 93 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించి.. 7 పిటిషన్లను ఆమోదించారు.
    •      జైల్‌సింగ్ తను నిర్ణయించిన 32 పిటిషన్లలో 30 పిటిషన్లను తిరస్కరించారు. ఆర్.వెంకటరామన్ 50 పిటిషన్లపై నిర్ణయం తీసుకుని  45 పిటిషన్లను తిరస్కరించారు.
    •         శంకర్‌దయాళ్‌శర్మ తన ముందుకు వచ్చిన మొత్తం 18 క్షమాభిక్ష పిటిషన్లనూ తిరస్కరించారు. 1997-2007 మధ్య ఇద్దరు రాష్ట్రపతులు తమ వద్దకు వచ్చిన దాదాపు అన్ని పిటిషన్లనూ పెండింగ్‌లో పెట్టారు.
    •    కె.ఆర్.నారాయణన్ తన ముందుకు వచ్చిన ఏ ఒక్క క్షమాభిక్ష పిటిషన్ పైనా నిర్ణయమూ తీసుకోలేదు.
    • అబ్దుల్‌కలాం కేవలం రెండు క్షమాభిక్ష పిటిషన్లపైనే నిర్ణయం తీసుకున్నారు. ఒక దాన్ని ఆమోదించి, మరొకదాన్ని తిరస్కరించారు.   
    •     ప్రతిభాపాటిల్ తన హయాంలో ఐదు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించి.. 34 క్షమాభిక్ష పిటిషన్లను ఆమోదించారు.
    •      ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇప్పటివరకూ 33 క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోగా.. వాటిలో 31 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు.

     
     క్షమాభిక్ష అభ్యర్థనలపై రాష్ర్టపతులనిర్ణయాలు
                            అంగీకారం  తిరస్కారం మొత్తం
     బాబూ రాజేంద్రప్రసాద్    180    1      181
     సర్వేపల్లి రాధాకృష్ణన్     57    0        57
     జాకీర్‌హుస్సేన్            22    0       22
     వీవీ గిరి                      3    0       3
     ఫకృద్దీన్ అలీ అహ్మద్    -    -         -
     నీలం సంజీవరెడ్డి           -    -        -
     జ్ఞానీ జైల్‌సింగ్             2    30      32
     ఆర్.వెంకట్రామన్         5    45      50
     శంకర్‌దయాళ్‌శర్మ      0    18       18
     కేఆర్ నారాయణన్      0    0         0
     అబ్దుల్ కలాం             1    1         2
     ప్రతిభాపాటిల్           34    5      39
     ప్రణబ్ ముఖర్జీ        2    31       33

మరిన్ని వార్తలు