'చైనా ఉత్పత్తులను నిషేదిద్దాం'

30 May, 2020 14:54 IST|Sakshi

లడఖ్‌ : భారత్‌, చైనాల మధ్య సరిహద్దుకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనాకు సంబంధించిన అన్ని ఉత్పత్తులతో పాటు టిక్‌టాప్‌ యాప్‌ను నిషేదిద్దామంటూ ఇంజనీర్‌ కమ్‌ సైంటిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌ చుక్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం వాంగ్‌చుక్‌ యూట్యూబ్‌ ద్వారా షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. వాంగ్‌చుక్‌ లడఖ్‌లోని హిమాలయాలు, సింధూ నదిని బ్యాక్‌డ్రాఫ్‌గా ఏర్పాటు చేసుకొని ఒక కొండపై కూర్చొని మాట్లాడాడు. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్)

' 3 ఇడియట్స్‌ సినిమాలో అమిర్‌ఖాన్‌ కారెక్టర్‌ చెప్పిన ' ఫున్సుక్ వాంగ్డు' డైలాగ్‌ నాకు ఆదర్శంగా నిలిచింది. చైనీయులకు సంబంధించిన అన్ని సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఒక వారంలోగా‌, హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను సంవత్సరం లోగా తిరిగి ఇచ్చేయండి. నేను నా ఫోన్‌ను వారం లోపలే చైనాకు తిరిగి ఇచ్చేస్తున్నా. మీ వాలెట్ శక్తిని ఉపయోగించండి. లడఖ్‌లో చైనా బెదిరింపులను ఆపడంతో పాటు చైనాకు వెట్టి చాకిరి చేస్తున్న 1.4 బిలియన్ కార్మికులు,  10 మిలియన్ ఉయ్ఘర్ ముస్లింలు, 6 మిలియన్ టిబెటియన్‌ బౌద్ధులను విముక్తి చేయడానికి పాటుపడదాం.

ఏటా చైనాకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను కొనడంతో పాటు టిక్‌టాక్‌ లాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని వారికి కోట్ల ఎకానమీ సంపదను సృష్టిస్తున్నాం. చైనా భారత్‌లో తమ వ్యాపారాన్ని పెట్టుబడులుగా పెట్టి ప్రతి ఏటా దాదాపు రూ . 6లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఆ డబ్బుతోనే చైనీయులు మన దేశం బోర్డర్‌ వద్ద కాపలా కాస్తున్న మన సైనికులను కాల్చి చంపుతున్నారు. ప్రస్తుతం భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతీయులను అర్థిస్తున్నా.. ఈ సమయంలో బులెట్‌ పవర్‌ కన్నా ఆర్థిక శక్తి అత్యంత బలం చూపెడుతుంది.. కాబట్టి 130 కోట్ల మంది భారతీయులతో పాటు విదేశాల్లో ఉంటున్న భారతీయులారా.. చైనా ఉత్పత్తులను నిషేధించడానికి సిద్ధమవండి. మనం చేస్తున్న పని సరైనదే అనిపిస్తే ప్రపంచం కూడా మనవెంటే ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు. (హద్దు మీరుతున్న డ్రాగన్)‌

కాగా లదా‌ఖ్ లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు భార‌త్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయ‌త్నం చేయ‌డంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య తాను మ‌ధ్యవ‌ర్తిత్వం చేస్తానంటూ డొనాల్డ్‌ ట్రంప్ ట్విటర్‌ ద్వారా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య థర్డ్‌పార్టీ (మూడో వ్యక్తి) జోక్యం అవసరం లేదనిభారత్‌తో పాటు డ్రాగన్‌ దేశం కూడా తేల్చిచెప్పింది. భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే శక్తీసామర్థ్యాలు తమకు (ఇరుదేశాలకు) ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు దేశాలైన తమ మధ్య డొనాల్డ్‌ ట్రంప్‌ తల దూర్చాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు