#మీటూ : ఎంజె అక్బర్‌ రాజీనామా

17 Oct, 2018 17:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులపై వెల్లువెత్తిన ఉద‍్యమంలో మీటూలో కీలక అడుగు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు పదవికి రాజీనామా చేశారు. పలు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు సోషల్‌ మీడియాలో ప్రకంపనలు పుట్టించాయి. ముందుగా ప్రియరమణి అనే జర్నలిస్టు ఆయనపై ట్విటర్‌ ద్వారా ఆరోపణల చేశారు. దీంతో అక్బర్‌ బాధితులు దాదాపు 20 మంది మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చారు.

తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను వ్యక్తిగతంగా ఎదుర్కొనేందుకే పదవి నుంచి తప్పుకున్నానని  బుధవారం ఎంజేఅక్బర్‌  విడుదల చేసిన ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. అలాగే కేంద్రమంత్రిగా దేశానికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు  ఈ సందర్భంగా  అక్బర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రియరమణిపై అక్బర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు, మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం​ వ్యక్తం చేశాయి. దీన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు,  తక్షణమే మంత్రి పదవికి ఎంజె అక్బర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు బీజేపీ అనుబంధ సంస్థ శివసేన కూడా అ‍క‍్బర్‌ వ్యవహారంపై మండిపడిన సంగతి తెలిసిందే.

ప్రియా రమణి ఏమన్నారు?
అటు  కేంద్రమంత్రి ఎంజే అక్బర్  రాజీనామాపై మీటూ ఉద‍్యమ ప్రధాన సారధి  ప్రియా రమణి  ట్విటర్‌లో స్పందించారు.  ఆయన  రాజీనామాతో మహిళలుగా విజయం సాధించాం. కోర్టులో కూడా  న్యాయపరంగా  విజయం సాధించే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు