మీటూ ఉద్యమానికి రాహుల్‌ మద్దతు

12 Oct, 2018 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మీటూ ప్రకంపనల నేపథ్యంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఈ అంశంపై నోరుమెదిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా స్పందించారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించడం ప్రతిఒక్కరూ నేర్చుకునేందుకు ఇదే సరైన సమయమన్నారు.

ఈమహిళలను గౌరవంగా, మర్యాదకరంగా చూడని వారికి సమాజంలో చోటు కుచించుకుపోవడం పట్ల తాను సంతోషంగా ఉన్నానన్నారు. మార్పు దిశగా అడుగులు పడేందుకు వాస్తవాన్ని బిగ్గరగా, స్పష్టంగా చాటిచెప్పాల్సిన అవసరం ఉందని మీటూ హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

పనిప్రదేశంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై గత రెండు వారాలుగా పెద్ద సంఖ్యలో మహిళలు గళంవిప్పడంతో మీటూ ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌, మీడియా, వినోద రంగాలు సహా పలు రంగాలకు చెందిన మహిళలు గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై బాహాటంగా వెల్లడిస్తుండటంతో  సెలబ్రిటీల్లో పెనుదుమారం రేగుతోంది.

మరిన్ని వార్తలు