#మీటూ ఎఫెక్ట్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో కమిటీ

24 Oct, 2018 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బుధవారం ఈ మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సభ్యులుగా ఉంటారు.

మహిళలు వారి వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని  కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు.  సమయంతో నిమిత్తం లేకుండా బాధితులు ఫిర్యాదు చేయడం,  ఈ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్‌లను  బలోపేతం చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా   ఈ కమిటీలో మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రికి   మేనకగాంధీ  కృతజ్ఞతలు తెలిపారు.

మీటూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో లైంగిక వేధింపుల కట్టడికి మరింత కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేస్తుంది. 3నెలల్లో, మహిళల భద్రత కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను పరిశీలించడంతోపాటు మరింత ప్రభావవంతమైన తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే మీటూ ఉ‍ద్యమానికి మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే.

>
మరిన్ని వార్తలు