#మీటూ: టాటామోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పైత్యం

12 Oct, 2018 10:51 IST|Sakshi

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మీడియా రంగంలో మొదలైన మీటూ ఉద్యమ ప్రకంపనలు క్రమంగా అన్నిరంగాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. మీటూ ఉద్యమానికి లభిస్తున్న మద్దతు నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా తమ అనుభవాలను, క్షోభను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. లైంగిక వేధింపుల వేటగాళ్ల బారిన పడి విలవిల్లాడిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. వారు ధైర్యంగా ముందుకు వస్తున్న తీరు ప్రశంసనీయం.

తాజాగా టాటా మోటార్స్‌లో వెలుగు చూసిన వేధింపుల పర్వంతో  కార్పొరేట్‌ రంగాన్ని కూడా మీటూ సెగ తాకినట్టయింది. మహిళలపై  లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఉదంతాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టు సంధ్యామీనన్‌ మరో బాధితురాలి గోడును ట్విటర్‌ వేదికగా బయటపెట్టారు. టాటా మోటార్స్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ చీఫ్‌ సురేష్‌ రంగరాజన్‌ వక్రబుద్ధిని బాధితురాలు అందించిన ట్విటర్‌ సమాచారం ఆధారంగా బహిర్గతం చేశారు. ఆ స్క్రీన్ల షాట్లను ట్విటర్‌లో షేర్‌ చేశారు. వీటిపై స్పందించిన టాటా మోటార్స్‌ అతగాడిని అడ్మినిస్ట్రేటివ్‌ లీవ్‌ కింద ఇంటికి పంపింది. ప్రతీ ఒక్కరికీ గౌరవనీయమైన సురక్షితమైన పనిపరిస్థితులను కల్పించేందుకు తామెపుడూ కృషి చేస్తామని టాటా మోటార్స్‌ ప్రకటించింది. విచారణ అనంతరం రంగరాజన్‌పై తగిన చర్య తీసుకుంటామని వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు