మరోసారి భారత్ కు సత్య నాదెళ్ళ!

21 May, 2016 09:37 IST|Sakshi

న్యూఢిల్లీః అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ  మే 30న మరోసారి భారత్ లో పర్యటించనున్నారు. ఈసారి పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే  ప్రత్యేక కార్యక్రమంలో ఆయన యువ వ్యాపారవేత్తలు, విద్యార్థులు, విద్యావేత్తలను కలుసుకొంటారు. అలాగే సీఐఐ నిర్వహించనున్నమరోకార్యక్రమంలో పాల్గొని  భారత్ లోని 150 మంది అత్యుత్తమ కార్పొరేట్ దిగ్గజాలతో కూడ సమావేశమౌతారు.

భారత్ ను సందర్శించనున్న నాదెళ్ళ ఈసారి పర్యటనలో భాగంగా  సాంకేతిక సంస్కృతి అభివృద్ధి, భారత్ లో పరివర్తన,  ప్రపంచంలో వాస్త సమస్యల పరిష్కారం వంటి అనేక సాంకేతిక విషయాలపై నిపుణులతో చర్చిస్తారు. ఏడు నెలల వ్యవధిలో నాదెళ్ళ భారత్ కు రావడం ఇది మూడోసారి కాగా గత డిసెంబర్ లో ఇండియా సందర్శించిన సందర్భంలో ఆయన...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలసి, అనంతరం హైదరాబాద్ లోని  స్టార్ట్ అప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ ను, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించారు.

నవంబర్ పర్యటనలో భాగంగా ముంబైలోని మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీషెడ్ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన నాదెళ్ళ.. అనంతరం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ వంటి వ్యాపారవేత్తలను, పరిశ్రమల అధినేతలను కలుసుకున్నారు. భారత్ లో ఇటీవల పెరుగుతున్న ప్రపంచ నేతల సందర్శనలు, ఒప్పందాలను చూస్తే దేశం ఒక్క ఔట్ సోర్సింగ్ కేంద్రగానే కాక, సాంకేతికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్న విషయం అర్థమౌతుంది.

మరిన్ని వార్తలు