కూలిన మిగ్‌ 21

18 Jul, 2018 22:43 IST|Sakshi

షిమ్లా: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన మిగ్‌ 21 ఫైటర్‌ జెట్‌ విమానం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌ మృతి చెందాడు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే జవాలీకి సమీపంలోగల పట్టా జతియన్‌ గ్రామంలో మధ్యాహ్నం 1.21గంటలకు కుప్పకూలింది. విమానం కూలిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. సహాయక చర్యలకోసం రెండు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ హెలిక్యాప్టర్లు రంగంలోకి దిగాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

ఈ ఘటనతో కలిపి.. ఈ ఏడాది ప్రమాదాలకు గురైన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఅఊ) విమానాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. జూన్‌ 27న మహారాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్‌–30, జూన్‌ 5న గుజరాత్‌లోని కచ్‌లో జాగ్వర్‌ విమానాలు కుప్పకూలాయి. మే 27న జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో మిగ్‌–21 ఫైటర్‌ కూలిపోయింది. ఒకప్పుడు మిగ్‌ 21 ఫైటర్‌ జెట్‌ విమానం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో అత్యంత కీలకమైనదిగా నిలిచింది.  

మరిన్ని వార్తలు