కరోనా కల్లోలం: కార్మికుడు బలి

11 May, 2020 09:05 IST|Sakshi
సఘీర్‌ అన్సారీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి  కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కార్మికుల పాలిట మృత్యు పాశమవుతోంది. తాజాగా మరో విషాధ గాథ వెలుగు చూసింది. బిహార్‌కు చెందిన వలసకార్మికుడు సఘీర్ అన్సారీ(26) ఢిల్లీ నుంచి బిహార్‌లోని తన స్వస్థలమైన తూర్పు చంపారన్‌కు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎలాగైనా సొంత ఊరికి చేరుకోవాలనే తపనతో 1000 కిలోమీటర్ల దూరాన్ని సైతం సైకిల్‌పై గెలవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మధ్యలోనే మృత్యువు మింగేస్తుందని ఊహించ లేకపోయాడు. 

కరోనావైరస్ లాక్‌డౌన్‌​ కారణంగా పని దొరకక పోవడంతో  తన సహచరులు ఏడుగురితో కలిసి మే 5న తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు అన్సారీ. అయిదురోజుల తరువాత సగం దూరం లక్నో చేరుకున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అల్పాహారం (అటుకులు) తినేందుకు రోడ్డు పక్కన ఆగారు. ఇంతలో అతివేగంతో  వచ్చిన ఓ కారు  వీరిని ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సఘీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే అక్కడ వున్న ఒక చెట్టు ఇతరులను రక్షించింది.

మొదట కొంత డబ్బు ముట్టజెప్పేందుకు బేరాలాడిన కారు డ్రైవరు ఆ తరువాత నిరాకరించి అక్కడినుంచి ఉడాయించాడు. స్థానికఎన్‌జీవోసహాయంతో సఘీర్ అన్సారీ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా ఇంటికి తరలించారు అతడి స్నేహితులు. బాధితునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పరిస్థితి ఉపాధిని దెబ్బతీయడంతో లక్షలాది మంది వలస కార్మికులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. వీరిని స్వగ్రామాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, వేలాదిమంది ఇప్పటికీ సైకిళ్లపైనో, కాలిబాటనో ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ప్రమాదాల్లో  ప్రాణాలు కోల్పోతున్నఘటనలు నమోదవుతున్నాయి. ఇటీవల ఛత్తీస్‌గడ్‌‌కు చెందిన భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. అలాగే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైల్వే ట్రాక్‌ ఘటనలో16 మంది వలస కార్మికులు మరణించిన ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి.

మరిన్ని వార్తలు