'తినడాని​కి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు'

16 May, 2020 10:21 IST|Sakshi

లుధియానా : కరోనా సమయంలో వలస కార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ గమ్యస్థానం చేరేందుకు కాలినడక కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కాలినడకలో వలస కార్మికుల కష్టాలు అన్నీఇన్ని కావు. ఆకలితో అలమటిస్తూ.. వేల కిలోమీటర్లు నడక సాగిస్తున్నారు. కొంతమంది వలస కార్మికుల బాధలు అయితే గుండెల్ని పిండేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలికి చెందిన ఓ కుటుంబం పంజాబ్‌లోని లుధియానాకు వెళ్లింది. లాక్‌డౌన్‌  కారణంగా వారికి ఉపాధి లేకపోవడంతో సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కుటుంబంలోని ఒక అబ్బాయికి మెడ భాగంలో గాయం ​కావడం.. నడవలేకపోవడంతో మంచంపై బాలుడిని పడుకోబెట్టి.. సుమారు 1300 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. 
(కరోనా : చైనాను దాటిన భారత్‌)

లుధియానా నుంచి సింగ్రౌలికి వెళ్లేందుకు వారికి 15 రోజుల సమయం పట్టింది. చివరకు యూపీలోని కాన్పూర్‌ చెక్‌పోస్టు వద్ద ఆ కుటుంబం కష్టాలను చూసిన పోలీసులు చలించిపోయారు. వారికి ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపించారు. ఈ సందర్భంగా కుటుంబంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ' పిల్లలతో పాటు 17 మంది లుధియానా నుంచి సింగ్రౌలికి కాలినడకన బయల్దేరాం. అందులో ఒక అబ్బాయికి మెడ గాయంతో పాటు నడవలేడు. దీంతో ఒక స్ర్టెచ్చర్‌ తయారు చేసి దాదాపు పదిహేను రోజుల పాటు నడిచాం. తినడానికి తిండి లేక నడిచేందుకు ఓపిక లేక మా పరిస్థితి దయనీయంగా తయారైంది. చివరకు కాన్పూర్‌లో పోలీసులు తమను ఆదుకున్నారు. పదిహేను రోజుల సమయంలో ఏ ఒక్క రోజు కూడా కడుపు నిండా తిండి తినలేదు.. ఆకలితో అలమటించాం' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు