వైరల్‌ ఫోటో.. వలస కూలీల సాహసం

12 May, 2020 15:54 IST|Sakshi

రాయ్‌పూర్‌: బీద, ధనిక తేడా లేకుండా కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. లాక్‌డౌన్‌ను ఆయుధంగా చేసుకుని దేశాలన్ని కరోనాతో పోరాడుతున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో పని లేక.. చేతిలో చిల్లి గవ్వ లేక వలసకూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చోట బతికే పరిస్థితి లేక.. సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. కానీ సరైన రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వలస కూలీల ఇక్కట్లకు అద్దం పట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ ఫోటోలో ఓ వ్యక్తి  ఒక చేత్తో పిల్లాడిని.. మరో చేత్తో తాడు పట్టుకుని ట్రక్కు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో ఏ మాత్రం పట్టు తప్పినా.. సదరు వ్యక్తితో పాటు అతని చేతిలోని పిల్లాడికి ఎంత ప్రమాదమో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మహిళలు చీరలతో టక్కు ఎక్కేందుకు పడే తిప్పలు చూస్తే కరోనా ఎంతటి కష్టాన్ని మిగిల్చిందో అర్ధమవుతుంది. అయితే కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల కోసం బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి సదరు వలస కూలీలను ప్రశ్నించగా.. ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించిన విషయం తమకు తెలియదన్నారు. నెల రోజులుగా పని లేక, తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అందుకే ప్రమాదం అని తెలిసి కూడా ఇలా వెళ్లక తప్పడం లేదని వాపోయారు.
 

మరిన్ని వార్తలు