కాలు ఫ్యాక్చర్‌... 245 కిమీ నడక

31 Mar, 2020 12:58 IST|Sakshi

భోపాల్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధిలేక, తింటానికి తిండిలేక పొట్టచేతపట్టుకుని సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వలసదారులు తమ కాళ్లకి పని చెబుతున్నారు. నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్తాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు వలస వచ్చిన ఓ కార్మికుడి పరిస్థితి కన్నీరు తెప్పిస్తోంది. ఇంటికెళ్లే మార్గంలేకపోవడంతో కాలుకున్న సిమెంట్‌ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడనక స్వస్థలానికి బయలేదేరాడు. (200 కిమీ నడక.. మధ్యలోనే ఆగిన ఊపిరి)

వివరాల ప్రకారం భన్వరాల్‌ అనే కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హుస్నాగాబాద్‌ ప్రాంతం నుంచి ఉపాధి కోసం రాజస్తాన్‌కు వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే పని ప్రదేశంలో ప్రమాదశాత్తు కాలు ఫ్యాక్చర్‌ కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఓవైపు ఉపాధిలేక, మరోవైపు ఇంటికి పంపేందుకు డబ్బులులేక అవస్థలు పడుతున్నాడు. స్వస్థలానికి వెళ్లడానికి వాహన సదుపాయం కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడపుతున్నాడు. ఇక చేసేందేమీ లేక కాలుకున్న సిమెంట్‌ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడకన స్వస్థలానికి బయలేదేరాడు. సుమారు 245 కిలోమీటర్లు నడక ద్వారా రాజస్తాన్‌లోని తన నివాసానికి వెళ్లాడానికి సిద్ధమయ్యాడు. రోడ్డుపై దీనిని చూసిన వారంతా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

కాగా కాలి నడకన వెళ్తున్న కొందరు కార్మికులు మార్గం మధ్యలోనే మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. రాజస్తాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు బయలుదేరిన ఓ కార్మికుడు ఆగ్రా సమయంలో గుండెపోటుతో మరణించారు. పలుప్రాంతాల్లో తిండిదొరక్క అలమటిస్తున్న వారికి స్థానికులు అండగా నిలిస్తున్నారు. కాగా ఉత్తర భారతం నుంచి వచ్చిన కొంతమంది తెలంగాణలోనూ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వారందరినీ ఆదుకుంటామని ఇక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు