కుళ్లిన అర‌టిపండ్ల‌కు ఎగ‌బ‌డ్డ వ‌ల‌స కార్మికులు

16 Apr, 2020 08:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆక‌లి రుచి ఎరుగ‌దు అంటారు. నిజ‌మే, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వ‌ల‌స కార్మికుల‌కు శ్మ‌శానంలో పార‌బోసిన‌ కుళ్లిన అర‌టిపండ్లే ఆహారమ‌య్యాయి. ఈ ద‌య‌నీయ ఘ‌ట‌న బుధ‌వారం ఢిల్లీలోని య‌మునా న‌దీ తీరంలో జ‌రిగింది. ఢిల్లీలోని నిగ‌మ్‌బోధ్ ఘాట్‌లోని శ్మ‌శానంలో కొంద‌రు  తిన‌డానికి ప‌నికి రానివి, కుళ్లిన స్థితిలో ఉన్న‌ అర‌టిపండ్ల‌ను ప‌డేసి పోయారు. ఇది లాక్‌డౌన్ వ‌ల్ల స్వస్థ‌లాల‌కు వెళ్ల‌లేక‌, య‌మునా న‌దీ తీరం ద‌గ్గ‌రే చిక్కుకుపోయిన‌ వ‌ల‌స కార్మికుల కంట ప‌డింది. తిండీనీళ్లు లేక అల‌మ‌టిస్తున్న వాళ్లు వెంట‌నే ఆ శ్మ‌శానంలోని అర‌టిపండ్ల‌ను ఏరుకోవడం ప్రారంభించారు. (‘యమున’  సాక్షిగా పస్తులు)

అక్క‌డే బ్యాగులో అర‌టిపండ్ల‌ను నింపుకుంటున్న ఓ వ్య‌క్తి దీని గురించి మాట్లాడుతూ.. "అర‌టిపండ్లు అంత త్వ‌ర‌గా చెడిపోవు. మంచివి ఏరుకుంటే కొద్ది కాల‌మైనా మా ఆక‌లి తీర్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి" అని పేర్కొన్నాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అలీఘ‌ర్‌కు చెందిన ఓ వ‌ల‌స కార్మికుడు మాట్లాడుతూ.. "మాకు స‌రిగా తిండి పెట్ట‌డం లేదు. కాబ‌ట్టి వీటిని తీసుకొని జాగ్ర‌త్త‌ప‌డ‌ట‌మే మంచిది. రెండు రోజులు క‌డుపు మాడిన త‌ర్వాత ఈరోజు ఆహారం దొరికింది" అంటూ త‌మ ద‌య‌నీయ ప‌రిస్థితిని వెల్ల‌డించాడు.(క‌రోనా: ఉత్త‌రాఖండ్‌లో చిక్కుకున్న 60 వేల‌మంది)

మరిన్ని వార్తలు