‘పస్తులుండటం కంటే పనికి వెళ్లడమే మేలు’

28 Jun, 2020 13:31 IST|Sakshi

వలస కూలీల పనుల బాట..

లక్నో : కరోనా మహమ్మారితో సుదీర్ఘ లాక్‌డౌన్‌ల నేపథ్యంలో స్వరాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌కు చేరిన 30 లక్షల మందికి పైగా వలస కార్మికుల్లో కొందరు తిరిగి పనులకు వెళ్లేందుకు సంసిద్ధమయ్యారు. లాక్‌డౌన్‌ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు గాడినపడుతుండటంతో పొట్టచేతపట్టుకుని కూలీలు తలో దిక్కుకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. కరోనా మహమ్మారితో భయపడికూర్చుంటే ఆకలితో మరణిస్తామని వారు తిరిగి పనుల బాట పడుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌ సహా వివిధ రాష్ట్రాలకు వెళ్లే గోరఖ్‌పూర్‌ రైల్వే జంక్షన్‌ వైపు వలస కూలీలు బారులుతీరారు. ‘ ఇక్కడే పనిదొరికితే నేను ఎక్కడికీ వెళ్లను.. ముంబై మహానగరంలో నేను పనిచేసే ఫ్యాక్టరీ ఇంకా తెరుచుకోలేదు.అయినా అక్కడికి వెళ్లి ఏదో ఒక పని చూసుకుంటా’నని అన్సారీ అనే కార్మికుడు చెప్పారు.

ఆకలితో తన పిల్లలు మరణించేకంటే కరోనాతో తాను చావడమే మేలని అన్నారు. ఇక కోల్‌కతాలోని ఓ సంస్థలో పనిచేసే ప్రసాద్‌ హోలీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చి యూపీలో చిక్కుకుపోయారు. తాను పనిచేసే సంస్థ తిరిగి తెరుచుకోవడంతో కోల్‌కతాకు తిరిగివెళుతున్నారు. కరోనా మహమ్మారి వెంటాడుతుండటంతో తిరిగి పనిలోకి వెళ్లాలంటే భయంగానే ఉన్నా కుటుంబాన్ని పోషించుకునేందుకు మరో గత్యంతరం లేదని ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీల కోసం యోగి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా పథకాలను ప్రారంభించినా అవి తమ వరకూ చేరలేదని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉపాథి హామీ సహా పలు పథకాలు ప్రకటించినా అవి తమ వరకూ చేరడం లేదని అందుకే తాను ముంబై తిరిగివెళుతున్నానని ఏసీ టెక్నీషియన్‌గా పనిచేసే మహ్మద్‌ అబిద్‌ చెప్పుకొచ్చారు.

ముంబైలో తాను బాగా సంపాదిస్తానని ఇక్కడ (యూపీ) మాత్రం నెట్టుకురాలేకపోతున్నానని అన్నారు. ఇక తూర్పు యూపీలోని బలియా రైల్వే స్టేషన్‌కూ పలువురు వలస కూలీలు పనికోసం తిరిగి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. అహ్మదాబాద్‌లో తాను కిరాణా షాపు నిర్వహిస్తున్నానని తిరిగి అక్కడకు వెళుతున్నానని మూడు నెలల కిందట స్వస్ధలానికి వచ్చిన రాజేష్‌ కుమార్‌ వర్మ చెప్పారు. ప్రభుత్వం రేషన్‌ ఇస్తున్నా ఇతర ఖర్చులకు డబ్బులు ఉండటం లేదని, ఉపాథి హామీ పథకం తప్ప వేరే పనులు ఉండటం లేదని ఆయన అన్నారు. షాపు అద్దెకు తీసుకుని అహ్మదాబాద్‌లో కిరాణా షాపు నడుపుతున్నానని, తిరిగి అక్కడికి వెళ్లకపోతే పేరుకుపోతున్న కిరాయిని ఎలా చెల్లిస్తానని వర్మ ప్రశ్నించారు. కరోనా మహమ్మారితో స్వస్ధలాలకు చేరుకున్న వలస కూలీల్లో పలువురు యూపీలోనే ఉంటుండగా మరికొందరు పస్తులుండటం కంటే పనిలోకి వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. చదవండి : వలస కార్మికులను ఆదుకోవడం అందరి బాధ్యత

మరిన్ని వార్తలు