ఐఐఎంకు వలస కార్మికుల లీగల్‌ నోటీసు

22 May, 2020 08:23 IST|Sakshi
వలస కార్మికులను చెదరగొడుతున్న పోలీసులు

అహ్మదాబాద్‌ : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనెజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌కు(ఐఐఎంఏ) వలస కార్మికులు లీగల్‌ నోటీసులు పంపించారు. ఐఐఎంఏలో ఓ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న వలస  కార్మికులు.. లాక్‌డౌన్‌ సమయంలో సంస్థ తమకు రెండు నెలల కాలానికి వేతనం చెల్లించలేదని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఐఐఎంఏ అధికారులు ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. ఐఐఎంఏ నిర్మాణ పనుల్లో పాల్గొన్న దాదాపు 100 మంది వలస కార్మికులు ఇటీవల అక్కడికి సమీపంలోని రద్దీగా ఉండే రోడ్డుపైకి చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులపై, అటుగా వెళ్లే వాహనాలపై రాళ్లు రువ్వారు. తమను స్వస్థలాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు వలస కార్మికులపై టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించి.. వారిని అక్కడి నుంచి తరలించారు. వారు చాలా కాలంగా తమను స్వస్థలాకు పంపించాలని స్థానిక అధికారులను కోరినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో వలసకూలీలు ఈ విధమైన నిరసన చేపట్టినట్టుగా తెలుస్తోంది.

అయితే ఆ మరుసటి రోజు ఐఐఎంఏ డైరెక్టర్‌, గుజరాత్‌ చీఫ్‌ సెక్రటరీ, అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ, డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌లకు వలస కార్మికులు ఒక లాయర్‌ ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు. ‘వలస కార్మికుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని దారుణంగా కొట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్దంగా.. ఇక్కడ వలస కూలీలకు ప్రధాన యజమానిగా ఉన్న ఐఐఎంఏ వారికి రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వలస కూలీల కుటుంబాల్లో దాదాపు 20 మంది చిన్నారులు, 30 మంది మహిళలు ఉన్నారు. వారికి కార్మిక చట్టాల ప్రకారం నిర్మాణం జరిగే ప్రదేశాల్లో వసతి కల్పించడం లేదు’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. (చదవండి : కూలీల ఇక్కట్లపై నేడు ప్రతిపక్షాల భేటీ)

దీనిపై స్పందించిన ఐఐఎంఏ డైరెక్టర్‌.. కార్మికుల అందరికి వారి బాకీలను చెల్లించామని తెలిపారు. స్వస్థలాకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించాలనే డిమాండ్‌తోనే కార్మికులు నిరసన చేపట్టారని అన్నారు. 

మరిన్ని వార్తలు