చవగ్గా అద్దె గృహ సముదాయాలు

9 Jul, 2020 03:11 IST|Sakshi

వలస కార్మికుల కోసం పట్టణాల్లో ఏర్పాటు

ప్రతిపాదనకు కేబినెట్‌ ఓకే

న్యూఢిల్లీ:  పట్టణాల్లోని వలస కూలీలు, పేదల కోసం చవకగా అద్దె గృహ సముదాయాలను(అఫర్డబుల్‌ రెంటల్‌ హౌజింగ్‌ కాంప్లెక్సెస్‌– ఏఆర్‌హెచ్‌సీ) అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికులకు.. తాము పని చేసే ప్రదేశాలకు దగ్గరలో చవకగా అద్దె ఇళ్లు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా, ప్రభుత్వ నిధులతో నిర్మితమై, ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌజింగ్‌ కాంప్లెక్స్‌లను 25 ఏళ్ల కన్సెషన్‌ అగ్రిమెంట్‌ ద్వారా ఏఆర్‌హెచ్‌సీలుగా మారుస్తారు. పట్టణ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా ఏఆర్‌హెచ్‌సీని అభివృద్ధి చేస్తారు. కన్సెషన్‌ అగ్రిమెంట్‌ పొందిన వ్యక్తి/సంస్థ ఆ భవన సముదాయానికి మరమ్మతులు చేసి, ఇతర సదుపాయాలు కల్పించి ఆవాసయోగ్యంగా మారుస్తారు. ఈ పథకానికి టెక్నాలజీ ఇన్నోవేషన్‌ గ్రాంట్‌ కింద రూ. 600 కోట్లను కేటాయించారు.

కన్సెషన్‌ అగ్రిమెంట్‌దారులను పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. 25 ఏళ్ల అగ్రిమెంట్‌ కాలం ముగిసిన తరువాత, ఆ కాంప్లెక్స్‌లు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోకి వెళ్తాయి. అనంతరం మళ్లీ బిడ్డింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. సొంత భూమిలో ఏఆర్‌హెచ్‌సీలను నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక అనుమతులు, సదుపాయాలు, ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పిస్తారు. పన్ను చెల్లింపుల్లోనూ రాయితీ ఇస్తారు.

ఈ పథకం ద్వారా 3.5 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని మే 14న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు.  కరోనా వైరస్‌ కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులైన పేద మహిళల కోసం ప్రకటించిన మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను.. వారు సెప్టెంబర్‌ చివరి వరకు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు మూడు ఉచిత సిలిండర్లను తీసుకోని వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.  

‘ఉచిత రేషన్‌’కు కేబినెట్‌ ఆమోదం  
ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌ కార్యక్రమానికి బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కరోనా కల్లోలం నేపథ్యంలో.. ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలి తీర్చేందుకు నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌ పథకాన్ని కొనసాగించనున్నట్లు జూన్‌ 30న మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు