విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు

28 May, 2020 08:34 IST|Sakshi

కార్మికుల పట్ల యజమాని  ఔదార్యం

కార్మికుల విమాన టికెట్లకు రూ. 68 వేలు వెచ్చించిన రైతు

 రూ.3 వేలు సహాయం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల అనేక కష్టాల మధ్య ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. కొన్నేళ్లుగా తన దగ్గర పనిచేస్తున్న పదిమంది కార్మికులను విమానంలో సొంత రాష్ర్టానికి పంపడానికి ఏర్పాట్లు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఢిల్లీకి చెందిన పుట్టగొడుగుల రైతు పప్పన్‌ గెహ్లాట్. దీంతో వీరంతా గురువారం ఉదయం బీహార్ లోని పాట్నాకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి బయలుదేరారు. అంతేకాదు యజమాని సొంత వాహనాల్లోనే విమానాశ్రయానికి చేరుకున్నారు. యజమాని  ఔదార్యానికి కార్మికులంతా సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో విమానం ఎక్కుతామని కలలో కూడా అనుకోలేదంటూ కృతజ్ఞతలు తెలిపారు. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు)

1993 నుండి పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నారు పప్పన్. బీహార్‌కు చెందిన ఈ కార్మికులంతా గత 20 ఏళ్లుగా తన  దగ్గర పనిచేస్తున్నారని, ఏప్రిల్ మొదటి వారంలో వారిని ఇంటికి పంపించాలనుకున్నా సాధ్యపడలేదని పప్పన్ తెలిపారు. శ్రామిక్‌ రైళ్లలోనే వారికి స్వస్థలాలకు పంపుదామని భావించినా టికెట్లు దొరకలేదన్నారు. వేలాది మైళ్ళు  కాలి నడకన వెళ్లడం,  రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం లాంటివి వింటున్నాం. ఈ నేపథ్యంలో వీళ్ల జీవితాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరించారు. అన్ని వైద్య పరీక్షలు, కరోనా సంబంధిత అన్ని మార్గదర్శకాలను పూర్తి చేశామని, ఇపుడిక  వారు  సురక్షితంగా  ఇంటికి చేరతారని చెప్పారు. విమాన టికెట్ల కోసం  తాను సుమారు రూ .6800 ఖర్చు చేశానని, అలాగే సొంత రాష్ట్రానికి చేరుకున్న తరువాత కూడా  ఇబ్బంది పడకుండా వారికి తలొక రూ.3 వేల నగదు ఇచ్చానని పప్పన్ గెహ్లాట్ చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేకపోవడంతో ఇప్పటిదాకా పప్పన్‌ వారికి ఆహారంతోపాటు నివాస ఏర్పాట్లూ చేయడం విశేషం. 

చదవండి:  పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి

>
మరిన్ని వార్తలు