ముషారఫ్‌ ఇంట్లో మికా సింగ్‌.. నెటిజన్ల ఆగ్రహం

11 Aug, 2019 19:15 IST|Sakshi

కరాచీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం రద్దు చేశాక భారత్‌, పాక్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. భారత్‌పై పాకిస్తాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడమేగాక పాక్‌లో బాలీవుడ్‌ సినిమాలపై నిషేదం విధించింది. కాగా, పాకిస్తాన్‌ మాజీ సైనిక నియంత పర్వేజ్‌ ముషారఫ్‌ కజిన్‌ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు మికా సింగ్‌ పాల్గొన్నారు. ఆయన పాటలు పాడుతుండగా పలువురు హుషారుగా  డాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఇది పాకిస్తాన్‌లోని చాలామందికి నచ్చలేదు. దీంతో ఇరుదేశాల నెటిజన్లు ఈ వీడియోపై ట్విటర్‌లో యుద్ధం చేసుకుంటున్నారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్టు నైలా ఇనాయత్‌.. ఈ వీడియోను ట్వీట్‌ చేస్తూ..  ‘జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ బందువుల ఫంక్షన్‌లో ఓ భారత సింగర్‌  ప్రదర్శన ఇచ్చారు. సంతోషం.. అదే పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇంట్లో ఇది జరిగి ఉంటే?.. అంటూ ప్రశ్నించారు. అలాగే ఓ పాకిస్తానీ ట్వీట్‌ చేస్తూ.. ‘ఒక పక్క ఇండియా చేతిలో కశ్మీర్‌ పతనం అవుతోంది. మరో పక్క కరాచీలో భారత కళాకారుడు ప్రదర్శనలు ఇస్తున్నాడు. నయా పాకిస్తాన్‌ అంటే ఇదేనేమో!’ అని కామెంట్‌ చేశారు. ‘బాలీవుడ్‌ సినిమాలు బ్యాన్‌ చేశారు. భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపేశారు. పాక్‌ గగనతలంలో భారత విమానాల రాకపోకలను నిషేధించారు. సరే.. విమానాలు రద్దు అయితే, వీసాలు ఇవ్వకుంటే వాళ్లు ఎలా పాక్‌ వచ్చారు. ఎందుకంటే ఈ నయా పాకిస్తాన్‌ ఓ షేమ్‌ పాకిస్తాన్‌’ అని ఆ నెటిజన్‌ మండిపడ్డాడు. దీనిపై భారత నెటిజన్లు స్పందిస్తూ.. ‘రాజకీయం వేరు.. కళలు వేరు.. కళలకు హద్దులు లేవు’ అని పేర్కొంటున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు