బిచ్చగాడు.. ద మిలియనీర్..

24 May, 2016 03:03 IST|Sakshi
బిచ్చగాడు.. ద మిలియనీర్..

ఇతడి పేరు పప్పూ కుమార్.. పట్నాలో బిచ్చమెత్తుకుని జీవిస్తుంటాడు.. మరి ఈ టైటిల్‌కు ఇతడికి ఏం సంబంధమనేగా మీ డౌటు. ఉంది.. పప్పూ కుమార్‌కున్న స్థిరాస్తి విలువ రూ.1.25 కోట్లు! అంతేకాదు.. అతడి బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షలు ఎప్పుడూ మూలుగుతునే ఉంటుంది! ఇంతేనా.. రోజూ షాపుల చుట్టూ తిరుగుతూ తాను బిచ్చం అడుక్కునే వ్యాపారులకే రూ.10 లక్షల దాకా అప్పులిచ్చాడు!! రెగ్యులర్‌గా బిచ్చంతోపాటు వడ్డీ కూడా వసూలు చేసుకెళ్తూ ఉంటాడు. మీకో విషయం తెలుసా? పప్పూ యాదవ్ బీటెక్ చదివి ఇంజనీర్ కావాలనుకున్నాడు.. మరి బిచ్చగాడిలా ఎలా మారాడు.. తెలుసుకోవాలంటే.. ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే..
 
పప్పూ యాదవ్ చిన్నప్పుడూ అందరిలాగే స్కూల్‌కు వెళ్లాడు. ఇంటర్ కూడా పాసయ్యాడు. గణితమంటే మక్కువ ఎక్కువ. అన్నిటికన్నా అందులోనే అతడికి 72 మార్కులు వచ్చాయి. ఇంజనీర్ కావాలనుకున్నాడు. కానీ ఓ ప్రమాదం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పాక్షికంగా పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. ఇంట్లో వాళ్లు పప్పూను పట్టించుకోవడం మానేశారు. చివరికి గతిలేక పట్నా రైల్వేస్టేషన్లో అడుక్కోవడం మొదలుపెట్టాడు.. ఏడేళ్లు గడిచాయి..
 
2015 సంవత్సరం.. ఓ రోజున.. రైల్వే పోలీసులు స్టేషన్లో బిచ్చగాళ్లను తరిమేయడం మొదలుపెట్టారు.. పప్పూ కుమార్ కదల్లేదు. భీష్మించుకుని కూర్చున్నాడు.. పోలీసులకు డౌట్ వచ్చింది. ఆరా తీశారు.. అసలు విషయం బయటపడింది.. రూపాయి రూపాయి దాచి.. అతడు ఒక్కోటి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రెండు ప్లాట్లు కొన్నాడు.. అతడికున్న 4 బ్యాంకు ఖాతాలు.. వడ్డీలకు అప్పులిస్తున్న విషయం బయటపడింది.. ఇంత డబ్బుంది కదా.. మామూ లు జీవితం జీవించమని చెప్పారు.. పప్పూ వినలేదు.. బిచ్చమెత్తుకోవడం మానలేదు. పోనీ.. ఆ పక్షవాతానికి చికిత్స చేయించుకోవచ్చు కదా అని చెబితే.. నేను చికిత్స చేయించుకుంటే.. ఇక నాకు బిచ్చమెవరు వేస్తారు అని ఎదురు ప్రశ్నించాడట.
 

 

మరిన్ని వార్తలు