ఎంఐఎం ఎంట్రీతో ప్రధాన పార్టీల బెంబేలు

23 Oct, 2014 00:17 IST|Sakshi
ఎంఐఎం ఎంట్రీతో ప్రధాన పార్టీల బెంబేలు

సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంఐఎం రెండు సీట్లు గెలుచుకోవడంతో ఇప్పటివరకు ముస్లిం ఓట్లపై ఆధారపడిన వివిధ పార్టీలు ఇబ్బందుల్లో పడిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను బరిలో దింపింది. ఇందులో ఇద్దరు అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. మిగతా చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానంలో నిలి చారు. ఈ ఫలితాలవల్ల రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి మంచి పట్టు సంపాదించిందని స్పష్టమైంది. దీంతో ఇప్పటివరకు మైనార్టీల ఓట్లపై ఆధారపడుతున్న  పార్టీలు ఖంగుతిన్నాయి. తమ పార్టీకి ఎవరు ఓటు వేసినా...వేయకపోయినా  మైనార్టీల ఓట్లు మాత్రం తప్పకుండా వస్తాయనే ధీమాతో ఉన్న పార్టీలు వచ్చే ఎన్నికల నుంచి మైనారిటీ ఓట్లపై ఆశ వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ముఖ్యంగా దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బైకలా, ఔరంగాబాద్ శాసన సభ నియోజక వర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయడంతో రాష్ట్రంలో ఖాతా తెరిచారు. అలాగే ముంబాదేవి, తూర్పు బాంద్రా, కుర్లా, వర్సోవా, తూర్పు భివండీ, ముంబ్రా-కల్వా, ఉత్తర నాందేడ్, దక్షిణ నాందేడ్, షోలాపూర్ సిటీ తదితర నియోజక వర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. దీని బట్టి చూస్తే వచ్చే ముంబై, ఠాణే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం ప్రభావం చూపే అవకాశముంది.  

మరిన్ని వార్తలు