బయోమెట్రిక్‌తో ఫోనే మినీ ఏటీఎం

10 Dec, 2016 04:44 IST|Sakshi
బయోమెట్రిక్‌తో ఫోనే మినీ ఏటీఎం

- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ
- ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని వినతి
- నగదు రహితంపై రెండ్రోజుల్లో కేంద్రానికి నివేదిక
- ‘ఓటుకు కోట్లు’పై మాట్లాడ్డానికేముందని ప్రశ్న


సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో సరికొత్త డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థను తీసుకురావడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు గురువారం ముంబైలో ఆర్బీఐ గవర్నర్‌తోపాటు ఉన్నతశ్రేణి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విషయాలను జైట్లీకి చంద్రబాబు వివరించారు. నగదు రహిత లావాదేవీలపై రెండ్రోజుల్లో కేంద్రానికి నివేదిక అందిస్తామని బాబు చెప్పినట్టు తెలుస్తోంది. బ్యాంకులు ఆధార్‌ ఆధారంగా చెల్లింపులకు అనుమతిస్తే సత్ఫలితాలు వస్తాయని, బయోమెట్రిక్‌ ఉపయోగిస్తే అన్ని ఫోన్లు మినీ ఏటీఎంలుగా మారుతాయని తదితర ప్రతిపాదనలను జైట్లీకి వివరించినట్టు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది.

పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందాలు..
వివిధ రంగాల్లో పరస్పర సహకారం కోసం పశ్చిమ ఆస్ట్రేలియాతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారం ఇక్కడి ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబు, పశ్చిమ ఆస్ట్రేలియ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సమావేశమై విద్య, సాంకేతికత, వ్యవసాయం, వాణిజ్య వ్యాపారం, మైనింగ్, పరిశోధనా రంగాల్లో పరస్పరం సహకరించుకొనేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పంద పత్రాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ ఆస్ట్రేలియ ప్రభుత్వ ట్రెజరర్‌ మైక్‌ నేహన్‌లు సంతకాలు చేశారు.  

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి..
నోట్ల రద్దు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు కోరారు. ఆధార్‌ వ్యవస్థ ద్వారా వేలిముద్రలు, ఐరిస్‌ ఆధారంగా చెల్లింపులు చేయవచ్చని, ఇప్పటికే అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లకు రూ.2 వేలుతో బయోమెట్రిక్‌ పరికరాన్ని జత చేస్తే బ్యాంకు లావాదేవీలు జరపొచ్చని సూచించారు. టీటీడీ పాలకమండలి సభ్యుడి వద్ద రూ.కోట్ల కొత్త నోట్లు లభించడంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అందులో మాట్లాడడానికి ఏముంది?
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మాట్లాడానికి ఏముందని ప్రశ్నించారు. తనకు విశ్వసనీయత ఉందని, తన మీద ఎన్నో సార్లు కేసులు వేశారని, ఏదీ నిరూపితం కాలేదన్నారు.

డిజిటల్‌ చెల్లింపులకు సన్నద్ధం అవ్వాలి
దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల అమలుకు టెలికాం ఆపరేటర్లు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఈ విధానం అమలుకు ఏర్పాటైన కమిటీ కన్వీనర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని నీతిఆయోగ్‌లో ఆయన టెలికాం ఆపరేటర్లు, హార్డ్‌వేర్‌ తయారీదార్లతో సమావేశమై ఈ విధాన లక్ష్యాన్ని, అవసరాలను వివరించారు. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌పేస్‌(యూపీఐ) పద్ధతిలో చెల్లింపులకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రెండు వారాల్లో సిద్ధం చేయాలని సూచించారు.  అప్లికేషన్ల సులభతర వినియోగంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పనగారియా  ఆపరేటర్లకు సూచించారు. అంతకుముందు కన్వీనర్‌ చంద్రబాబు, కమిటీలోని మిగిలిన సభ్యుల తో వీడియో కాన్ఫరెన్స్‌లో  చర్చించారు.   కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ చెల్లింపులకు ఇచ్చిన రాయితీలను అమలుచేయడంలో బ్యాంకర్ల నిర్లక్ష్యంపై మాట్లాడుతూ వాటిని వినియోగదారులకు తిరిగి చెల్లించేలా కేంద్రం ఆదేశాలివ్వాలని కమిటీ సిఫారసు చేయనున్నట్టు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు.

>
మరిన్ని వార్తలు