‘కనీస వేతన’ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచండి

2 May, 2014 04:24 IST|Sakshi

న్యూఢిల్లీ: సంఘటిత, అసంఘటిత రంగంలోని పనివారికి ఇప్పటికే ప్రకటించిన విధంగా కనీస వేతనాలను అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ సదరు యాజమాన్యాలను ఆదేశించింది. వేతనాల చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలను ఉద్యోగుల జాబితా మేరకు వెబ్‌సైట్‌లో పొందు పరచాలని కోరింది. ఆయా వివరాలను ఆన్‌లైన్‌లో పొందు పరిచేందుకుగాను యాజమాన్యాలకు 90 రోజుల గడువు ఇస్తున్నట్టు కార్మిక శాఖ వెల్లడించింది. యాజమాన్యాలు కార్మికులకు చెల్లించే వేతనాలను ఈసీఎస్ లేదా చెక్కుల ద్వారా మాత్రమే చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించని యాజమాన్యాలపై సంబంధిత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ అధికారులు హెచ్చరించారు. కార్మికులను కాంట్రాక్టు పద్ధతిపై నియమించుకోవడాన్ని తగ్గించుకోవాలని, అది సాధ్యం కాకపోతే శాస్వత కార్మికులకు ఇస్తున్న వేతనాలనే కాంట్రాక్టు ఉద్యోగులకూ వర్తింపజేయాలని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు