సెలెక్ట్ కమిటీకి గనుల బిల్లు

11 Mar, 2015 04:50 IST|Sakshi

నిరసనల మధ్య రాజ్యసభలో బిల్లు
 
న్యూఢిల్లీ: బీజేపీకి బలం లేని రాజ్యసభలో విపక్షాలు మరోసారి పంతం నెగ్గించుకున్నాయి. మంగళవారం గనులు, ఖనిజాల అభివృద్ధి సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది.  బిల్లును నేరుగా ఆమోదింపజేసుకోవాలనుకున్న ప్రభుత్వ యత్నం విఫలమైంది. మెజారిటీ లేని కారణంగా విపక్షాల ఒత్తిడికి తలొగ్గి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష సవరణను ఆమోదిందించిన నిస్సహాయ స్థితి నుంచి తేరుకోకముందే ప్రభుత్వానికి పెద్దల సభలో మళ్లీ షాక్ తగిలింది.

విపక్షాల తీవ్ర నిరసనల మధ్య రాజ్యసభలో మంత్రి నరేంద్ర సింగ్ గనుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చకు ముందే విపక్షాలు బిల్లుపై అభ్యంతరం చెప్పాయి. దీన్ని పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించాలా వద్దా అన్న అంశంపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. తమ వాదనలకు బలంగా అధికార, విపక్షాలు సభా నియమాలను చెప్పుకొచ్చాయి. ప్రభుత్వం దొడ్డిదారిన చట్టాలు తెస్తోందని విపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. నిరసన మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో బిల్లును స్థాయీసంఘానికి పంపడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ సంఘానికి కాలపరిమితిని బుధవారం నిర్ణయిస్తారు.
 
 

>
మరిన్ని వార్తలు