అత్యాచారం అంటే... మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

10 Jun, 2019 11:09 IST|Sakshi

రేప్‌లపై బీజేపీ మంత్రివర్యుల కొత్తభాష్యం, మండిపడుతున్న నెటిజనులు

మైనర్‌ బాలికలపై అత్యాచారం జరిగితే  అది రేప్‌  - ఉపేంద్ర తివారి

30-35 ఏళ్ల వివాహిత మహిళలపై  రేప్‌ అంటే అది వేరు - ఉపేంద్ర తివారి

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి "అత్యాచార స్వభావం" పై విచిత్ర భాష్యం చెప్పుకొచ్చారు. నీటి సరఫరా, భూ అభివృద్ధి, నీటి వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ అత్యాచార ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశవ్యాప్తంగా పసిమొగ్గలు, మైనర్‌ బాలికలపై పాశవికమైన అత్యాచారం, హత్యలు తీవ్ర ఆందోళన రేపుతోంటే.. బాద్యతా యుతమైన మంత్రి స్థానంలో ఉన్న తివారి వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. మహిళలపై బాధ్యతారహిత వ్యాఖ్యలతో  నోరు పారేసుకున్నారు.  ఈ  వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

మైనర్‌ బాలికలపై జరిగిన అత్యాచారాలు మాత్రమే నిజమైన రేప్‌లుగా పరిగణించాలని తివారి వ్యాఖ్యానించారు. కానీ కొన్నిసార్లు 30-35 వివాహిత మహిళలు కూడా  రేప్‌ ఆరోపణలతో ముందుకు వస్తున్నారని, అయితే ఈ ఘటనల స్వభావం వేరుగా ఉంటుందని, ఇలాంటి కేసులను భిన్నంగా చూడాలన్నారు. ఈ మహిళలు చేస్తున్న అత్యాచార ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు సదరు మహిళలు  7-8 సంవత్సరాలుగా నిందితుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వుండి వుంటారని పేర్కొన్నారు. తివారీ వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు. యూపీ అలీగఢ్‌లో రెండున్నరేళ్ల పాప దారుణ హత్యపై స్పందించిన ఉపేంద్ర తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అత్యాచార ఘటనలు నమోదైన వెంటనే ముఖ్యమంత్రి వేగంగా స్పందించి విచారణకు ఆదేశించడంతోపాటు, నేరస్తులపై కఠిన చర్య తీసుకుంటున్నారని చెప్పడం   కొసమెరుపు.

మరిన్ని వార్తలు