ఓబీసీ సబ్‌ కేటగిరీపై మంత్రి కీలక వ్యాఖ్యలు

2 Aug, 2018 19:38 IST|Sakshi

ఆయా రాష్ర్టాల్లో అమల్లో ఉన్న విధానాలను పరిశీలిస్తామని వెల్లడి

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలోని కులాలను ఉప కేటగిరీల కింద విభజించే అంశంపై కమిషన్‌ అధ్యయనం చేస్తోందని సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ రాజ్యసభలో గురువారం ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఓబీసీలను ఉప కేటగిరీలుగా విభజించే అంశాన్ని పరిశీలించేందుకు 2017 లోనే ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బీసీలను ఉప కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నారనీ, కేంద్ర జాబితాలోని ఓబీసీలను సైతం ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పద్ధతిలోనే ఉప కేటగిరీల కింద విభజించే అవకాశాలను కమిషన్‌ పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు.  సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే బీసీలలో క్రీమీ లేయర్‌ విధానం అమలు చేస్తున్నామని, ఈ విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు