నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులివ్వండి

9 Feb, 2018 02:11 IST|Sakshi
ఢిల్లీలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో భేటీ అయిన మంత్రి కేటీఆర్‌

దేశ ఫార్మాకు ఊతమిచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం 

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరిన మంత్రి కేటీఆర్‌ 

మైనింగ్‌ టుడే–2018 సదస్సుకు ఆహ్వానం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ఫార్మాసిటీ నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను మంత్రి కె.తారకరామారావు కోరారు. జాతీయ ఆరోగ్య భద్రతకు దోహదపడే ఈ ప్రాజెక్టు తెలంగాణతోపాటు యావత్‌ దేశానికి ఉపయోగపడుతుందని వివరించారు. గురువారం కేంద్ర మంత్రిని పార్లమెంటులో కలుసుకున్న కేటీఆర్‌.. నిమ్జ్‌ లక్ష్యాలను వివరించారు. 

ప్రాణాంతక వ్యాధుల నివారణకు అవసరమైన యాంటిబయోటిక్స్‌ను 84 శాతం వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వ్యాధి నిరోధక మందుల కోసం భారీ స్థాయిలో ఇతర దేశాలపై ఆధారపడటం దేశానికి తీవ్రమైన సమస్య అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ ఫార్మా రంగానికి ఉత్తమిచ్చేలా నిమ్జ్‌ను ఏర్పాటు చేయనున్నామని, దీని ఏర్పాటుకు అవసరమైన ఈఐఏ నివేదికను ఇటీవల కేంద్రానికి పంపామని చెప్పారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ చాప్టర్, ఎఫ్‌ఐసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరగనున్న మైనింగ్‌ టుడే–2018 సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని హర్షవర్ధన్, మరో మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌లను కేటీఆర్‌ ఆహ్వానించారు. 

హైదరాబాద్‌లో ‘డీఐపీ’ఏర్పాటు చేయండి 
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రెండు డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ (డీఐపీ) కారిడార్‌లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. రక్షణ రంగంతో హైదరాబాద్‌కు అనుబంధం ఉందని.. రక్షణ రంగ సంస్థలు, పరికరాల తయారీలో ముందు వరుసలో ఉందని వివరించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ రాత్రి సమావేశమైన కేటీఆర్‌ పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కానున్నారు.

                        - ఢిల్లీలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన కేటీఆర్‌ 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా