డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక తప్పు

19 May, 2016 01:43 IST|Sakshi
డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక తప్పు

వాయుకాలుష్య నివేదికపై మండిపడ్డ జవదేకర్
భారత్‌నే లక్ష్యంగా చేసుకుంటున్న పాశ్చాత్య దేశాలు
 
న్యూఢిల్లీ: వాయుకాలుష్యం పైప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదిక పూర్తిగా తప్పుదారి పట్టించేదిలా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోతున్న 100 నగరాల్లో 30 నగరాలు భారత్‌కు చెందినవే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదకలో పేర్కొనడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. వాయుకాలుష్యంపై పాశ్చాత్య దేశాలు భారత్‌నే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా, ఐరోపాదేశాలతోపాటు భారత్‌లోని నగరాల్లో కాలుష్యంపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను విడుదల చేస్తామని తెలిపారు.

డబ్ల్యూహెచ్‌వో నివేదికలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, బెంజిన్ వంటి కీలక కాలుష్య కారకాలను కారణాలుగా చూపలేదన్నారు. 2012-13 నాటి సమాచారాన్ని విశ్లేషించి ఢిల్లీ నగరం వాయుకాలుష్యంలో 11 వస్థానంలో ఉందని.. దీనిపై ప్రపంచ పర్యావరణ వేత్తలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. పీఎం 2.5 స్థాయి ఆధారంగా నగరాల్ని వర్గీకరించారని..కానీ వీటికంటే వాయుకాలుష్యంను పెంచే ఓజోన్ కాలుష్యం, బె ంజిన్ కాలుష్యం, సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ డైయాక్సైడ్‌లు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మంత్రి తెలిపారు. పీఎం స్థాయి 2.5 ఉన్న నగరాలు  ప్రత్యేకంగా అమెరికా, ఐరోపా దేశాల్లో చాలా ఉన్నాయన్నారు. త్వరలో తమ ప్రభుత్వం విడుదల చేయబోయే వాయుకాలుష్య నగరాల జాబితాను డబ్ల్యూహెచ్‌వో నివేదికకు కౌంటర్ పార్ట్ కాదని.. కేవలం ప్రజల అవగాహన కోసమేనని మంత్రి వివరించారు. పీఎం 1 పై పర్యవే క్షణకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు  ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు