'పటాసులు కాల్చండి.. డ్రమ్ములు వాయించండి'

31 May, 2020 11:38 IST|Sakshi

నాగ్‌పూర్‌ : మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ప్రజలు పటాసులు కాల్చాల్సిందిగా, డ్రమ్ములను వాయించాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం కతోల్‌లో మిడతల దాడి పరిస్థితిపై మంత్రి సమీక్ష చేపట్టారు. రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఎప్పుడైతే మిడతలు దాడి చేస్తాయో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పటాకులు కాల్చడం, టైర్లను కాల్చడం, డ్రమ్ములను వాయించడం వంటి చర్యలతో మిడతలను పారద్రోలాలన్నారు.(మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!)

అంతకముందు మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదా భూషే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం మిడతలను వ్యవసాయ విభాగం నిర్మూలించిందన్నారు. రసాయనాలు స్ప్రే చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించినట్లు తెలిపారు. మిడతల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా రసాయనాలు, పురుగుమందులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.పాకిస్తాన్‌ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతలు గాలి ద్వారా తమ దిశను మార్చుకుంటున్నాయి. రాజస్తాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానాలో పెద్ద ఎత్తున పంటపొలాల మీద పడి పంటను నాశనం చేస్తున్నాయి. ఒక్కో గుంపులో వేల నుంచి లక్ష సంఖ్యలో ఉండే మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలను మిడతల దండు స్వాహా చేస్తాయి.
(మధ్యప్రదేశ్‌ వైపు మిడతల దండు!)

మరిన్ని వార్తలు