హెల్త్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే ఎంట్రీ..

14 Apr, 2020 17:15 IST|Sakshi

పనాజీ : కోవిడ్‌ -19 కట్టడికి కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత గోవాకు విమానాల్లో వచ్చే పర్యాటకులను హెల్త్‌ సర్టిఫికెట్‌ తీసుకువస్తేనే అనుమతిస్తామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి విశ్వజిత్‌ రాణే స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి కోవిడ్‌-19 సర్టిఫికెట్‌ లేకుండా విమాన ప్రయాణీకులను అనుమతించరాదనే అంశాన్ని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లాలని తాను ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ను కోరానని మంత్ర రాణే చెప్పారు. ఈ నిబంధనను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలకు చేరవేస్తుందని తెలిపారు.

కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి రాష్ట్రం సొంతంగా నియమనిబంధనలు అనుసరించే అధికారం ఉందని చెప్పారు. గోవాలో కరోనా రోగులందరూ ఇన్ఫెక్షన్‌ నుంచి బయటపడినా అధికారులు విరామం తీసుకోబోరని, తాలూకా స్ధాయిలో టెస్టింగ్‌ సదుపాయాలను పెంచి వ్యాధి వ్యాప్తి కాకుండా నిరోధిస్తామని చెప్పారు. పారిశ్రామిక వాడలు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పది ర్యాపిడ్‌ టెస్టింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు జీరోకు చేరినా ముప్పు ముగిసినట్టు కాదని, విపత్తు చట్టానికి అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ వాడటాన్ని తప్పనిసరి చేస్తామని చెప్పారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా టెస్టింగ్‌ కేంద్రాలను పెంచి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.

చదవండి : గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

>
మరిన్ని వార్తలు