‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం

29 Sep, 2018 04:37 IST|Sakshi

అక్టోబర్‌ 31 నాటికి నివేదిక

న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్‌ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది.

జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్, పంజాబ్‌ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్‌ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్‌ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్‌ ఆర్థిక మంత్రి ప్రకాశ్‌ పంత్‌లకు కమిటీలో చోటు కల్పించారు. 

మరిన్ని వార్తలు