‘లాక్‌డౌన్‌’ పై చర్చించనున్న మంత్రులు!

21 Apr, 2020 12:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 17,656కు చేరగా.. 559 మంది మరణించారు. ఈ నేపథ్యంలో  మహమ్మారిని కట్టడి చేసేందుకు పొడిగించిన లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా అత్య‌వ‌సరం కాని సేవ‌ల‌కు అనుమ‌తినిస్తూ కేరళ వంటి రాష్ట్రాలు నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ క్రమంలో మే 3 తర్వాత లాక్‌డౌన్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో కేంద్ర మంత్రులు భేటీ కానున్నట్లు సమాచారం. (లాక్‌డౌన్ అన‌‌వ‌స‌ర స‌డ‌లింపులు వ‌ద్దు: కేంద్రం)

ఇక ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించే అవకాశాలు లేకపోయినప్పటికీ... భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సమావేశం కానున్న మంత్రుల బృందం గ్రీన్‌ జోన్లు, ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనల్లో మరింత సడలింపునివ్వడం సహా... కంటైన్మెంట్‌ జోన్లలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత గురించి సమాలోచనలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.  (భారత్‌లో అదుపులోకి రాని కరోనా)

>
మరిన్ని వార్తలు