రికార్డు స్థాయిలో రికవరీ 

4 Jul, 2020 05:38 IST|Sakshi

60 శాతానికి పైగా కోలుకున్న కోవిడ్‌ రోగులు

మరోవైపు భారీగా కొత్త కేసులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని త్వరితగతిన గుర్తించడం, సరైన సమయానికి వైద్య చికిత్సను అందించడం ద్వారా భారత్‌ రికవరీ రేటులో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. 60.73 శాతం రికవరీ రేటుని సాధించడంతో అందరిలోనూ ఆశాభావ దృక్ఫథం పెరుగుతోంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఒకే రోజులో మొదటిసారి 20 వేల మార్క్‌ని దాటి కేసులు నమోదైనప్పటికీ, రికవరీ రేటు కూడా రోజు రోజుకీ పెరుగుతూ ఉండడం భారీగా ఊరటనిచ్చే అంశం. 24 గంటల్లో 20,032 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జయ్యారు. కరోనా పరీక్షలను భారీగా పెంచడం ద్వారా వైరస్‌ సోకిన తొలి రోజుల్లోనే గుర్తించి, రోగులకు సరైన సమయంలో సరైన చికిత్స అందించడంతో భారీగా రికవరీ రేటు సాధించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

కోవిడ్‌–19ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంత సన్నద్ధంగా ఉన్నాయో అనే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నతస్థాయి అధికారులతో శుక్రవారం సమావేశమై చర్చించారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల మధ్య సమన్వయంతో ట్రేస్, టెస్ట్, ట్రీట్‌ అనే సూత్రం ద్వారా మంచి ఫలితాలను రాబడుతున్నామని, యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయని సమావేశానంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,79,891 మంది కోవిడ్‌ నుంచి కోలుకుంటే, 2,27,439 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్క రోజే 2,41,576 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

ఒకే రోజు 20,903 కేసులు 
దేశంలో కరోనా వైరస్‌ బయటపడ్డాక మొదటి సారిగా 24 గంటల్లో 20,903 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,25,544కి చేరుకుంది. ఒకేరోజులో 379 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 18,213కి చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.

కోవిడ్‌తో మరణించిన డాక్టర్‌ కుటుంబానికి కోటి 
కోవిడ్‌–19తో పోరాడి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌ అసామీ గుప్తా కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం కలుసుకున్నారు. నష్టపరిహారంగా ఆ కుటుంబానికి కోటి రూపాయల చెక్‌ అందజేశారు. గుప్తాను ప్రజల డాక్టర్‌గా అభివర్ణించిన కేజ్రివాల్‌ ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ట్వీట్‌ చేశారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో జైడస్‌ కాడిలా 
కరోనా వైరస్‌కు టీకా రూపొందించే దిశగా మరో భారతీయ కంపెనీ ముందడుగు వేసింది. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ కాడిలా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అనుమతి లభించింది.  ‘జైడస్‌ కాడిలా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ జంతువులపై చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు మానవ ప్రయోగాల కోసం మొదటి, రెండో దశలకు డీసీజీఐ అనుమతించింది. త్వరలోనే మానవులపై ఈ కంపెనీ టీకాను పరీక్షించి చూస్తుంది’అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

>
మరిన్ని వార్తలు