మీడియాకు ముఖం చాటేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

20 May, 2020 15:25 IST|Sakshi

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీరుపై విస్మయం

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు లక్ష దాటడంతో కరోనా వైరస్‌ ప్రభావిత టాప్‌ 10 దేశాల్లో భారత్‌ చేరింది. వైరస్‌ ఉధృతి అధికంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉన్నా కేసుల సంఖ్య మాత్రం వేగంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌గా భారత్‌ మారుతుండటం కలవరం కలిగిస్తోంది. కేసులు అనూహ్యంగా పెరుగుతున్న క్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత కొద్దిరోజులుగా మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. మే 7 నుంచి భారత్‌లో ప్రతిరోజూ 3,200కు పైగా తాజా కేసులు నమోదవుతున్నాయి. ఇక గత నాలుగు రోజులుగా కరోనా కేసులు రోజుకు 4950కి పైగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజులోనే ఏకంగా 5611 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో గతంలో ప్రతిరోజూ మీడియాకు కేసుల పరిస్థితిని వివరించే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పుడు ముఖం చాటేస్తోంది.

గత ఎనిమిది రోజులుగా క్షేత్రస్ధాయిలో మహమ్మారి పరిస్థితి, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక్క మీడియా సమావేశాన్ని సైతం నిర్వహించలేదు. చివరిసారిగా మే 11న ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా భేటీని నిర్వహించింది. వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్నా మీడియాతో నేరుగా ఎందుకు వివరాలు పంచుకోవడం లేదనే అంశంపైనా ఎలాంటి వివరణా లభించలేదు. ఇక మే 11 నుంచి 20 మధ్య దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అమాంతం 59 శాతం పెరిగి 67,152 నుంచి 1,06,750కి ఎగబాకాయి.

చదవండి : కరోనా కాటు : ఉద్యోగులపై వేటు

కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు రోజూ మీడియాతో ముఖాముఖి నిర్వహించి మహమ్మారి వ్యాపిస్తున్న తీరును వివరిస్తూ, విలేకరుల నుంచి సూచనలు స్వీకరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మీడియా ముందుకు రావడం లేదు. కరోనా కేసులు తీవ్రతరమైన తరుణంలో వరుసగా ఎనిమిది రోజుల పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సమావేశాలను నిర్వహించకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య వంటి అన్ని వివరాలను ప్రతిరోజూ ఉదయం అప్‌డేట్‌ చేస్తున్నా నేరుగా మీడియాతో మాట్లాడితే ప్రజలకు పూర్తి వివరాలు అందడంతో పాటు విలేకరులు అడిగే ప్రశ్నల ద్వారా సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు