కరోనా వ్యాక్సిన్‌ : ప్రకటనలో గందరగోళం

5 Jul, 2020 20:14 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనాను అంతం చేయడంలో దేశీయ వ్యాక్సిన్లు ఏ విధంగా పోటీలో ఉన్నాయో తెలుపుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో గందగోళం చోటుచేసుకుంది. తొలుత సదరు మంత్రిత్వ శాఖ పేరిట పీఐబీలో ఒక ప్రకటన కనిపించింది. అందులో ‘కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై 6 భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. భారత్‌కు చెందిన ‘కోవాక్సిన్‌’,  'జైకోవ్‌- డీ'లతోపాటుగా ప్రపంచంలోని 140 వ్యాక్సిన్లలో 11 క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇందులో ఏది కూడా 2021 కన్నా ముందుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటికే ‘2021 కంటే ముందుగా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అనే లైన్‌ను తొలగించారు. (చదవండి : కోవిడ్‌-19 టీకా: ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన)

మరోవైపు కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.  ప్రపంచంలోని మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 15నాటికి విడుదల చేయాలన్నదే తమ లక్ష్యమని ఐసీఎంఆర్‌ పేర్కొంది. అయితే దీనిపై వైద్య నిపుణలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు వ్యాక్సిన్‌కు సంబంధించి తేదీని నిర్ణయించారనే పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ ప్రకటనపై ఐసీఎంఆర్‌ స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్‌ ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు తెలిపింది.దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని​ వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది.(చదవండి : కరోనా ‘కోవాక్సిన్‌’పై కొత్త గొడవ)

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కోవ్యాక్సిన్’‌,  ఫార్మా సంస్థ జైడస్ తయారు చేసిన ‘జైకోవ్- డి’ ల క్లినికల్‌ ట్రయల్స్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఏ) అనుమతించిన సంగతి తెలిసిందే. క్లినికల్‌ ట్రయల్స్ తొలి దశలో భద్రతపై దృష్టి సారించగా, రెండో దశలో వ్యాక్సిన్‌ సమర్ధతను పరీక్షించనున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. (చదవండి : ‘కోవాక్సిన్​’ తీసుకున్న తొలి వ్యక్తి ఈయనేనా?)

మరిన్ని వార్తలు