ఆ సర్వేను తోసిపుచ్చిన మోదీ సర్కార్‌..

27 Jun, 2018 18:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహిళల భద్రతలో భారత్‌ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని రాయ్‌టర్స్‌ సర్వే వెల్లడించడాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. సర్వేలో వెల్లడించిన అంశాలు కేవలం ఒపీనియన్‌ పోల్‌ ఆధారంగా చెప్పినవేనని, ఎలాంటి గణాంకాలు, నివేదిక ఆధారంగా వెల్లడించినవి కాదని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. కేవలం 548 మందిని ఆరు ప్రశ్నలు అడగటం ద్వారా ర్యాంకింగ్‌లు ఇచ్చారని, మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి సమాచారం, అభిప్రాయం కోరలేదని పేర్కొంది.

జాతీయ మహిళా కమిసన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) సైతం ఈ సర్వేను తోసిపుచ్చింది. 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో కేవలం కొద్దిమంది అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితి ప్రతిబింబించదని పేర్కొంది. మహిళా హక్కుల విషయంలో చాలా దేశాల కంటే భారత్‌ మెరుగైన స్ధానంలో ఉందని స్పష్టం చేసింది.

మరోవైపు మహిళల భద్రతపై రాయ్‌టర్స్‌ నివేదికను కాంగ్రెస్‌ సహా విపక్షాలు ప్రస్తావిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మోదీ ఖరీదైన మైదానాల్లో యోగాసనాలు వేస్తుంటే దేశ మహిళల భద్రత ఆందోళనకరంగా మారిందన్న సర్వేలు సిగ్గుచేటని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 

మరిన్ని వార్తలు