తుపాకితో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం

29 Jul, 2014 11:07 IST|Sakshi
తుపాకితో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం

దేశరాజధానిలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ఆమెకు తెలిసున్న ఐదుగురు కలిసి తుపాకి చూపించి బెదిరించి.. సామూహిక అత్యాచారం చేశారు.  ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈ బాలిక వారం రోజుల క్రితం స్కూలుకు వెళ్తుండగా, దారిలో అటకాయించిన నిందితులు పశ్చిమ ఢిల్లీలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. నిందితులు ఐదుగురిలో ముగ్గురు మైనర్లు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను తుపాకితో బెదిరించినట్లు బాలిక తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది.

అత్యాచారం సంఘటనను నిందితులు సెల్ఫోన్లో రికార్డు చేశారని కూడా బాధితురాలు చెప్పింది. అయితే, పోలీసులకు మాత్రం నిందితుల వద్ద తుపాకి ఏమీ దొరకలేదు. తనకు ఒంట్లో బాగోలేదని బాలిక వారం రోజుల తర్వాత చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడు తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని, 20 ఏళ్ల నిందితుడిని వాళ్ల ఇంట్లోనే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు