ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంత పనిచేశారు...

16 Feb, 2016 17:18 IST|Sakshi
ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంత పనిచేశారు...

పనాజీ: ఓ మైనర్ బాలిక(16)ను ఆమె ఫేస్బుక్ స్నేహితులు కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతం గోవాలో చోటుచేసుకుంది. గోవా పోలీసుల కథనం ప్రకారం... ఓ మైనర్ బాలిక పోర్వోరిమ్ ఏరియాలో ఉంటుంది. కాలేజీకి వెళ్తుండగా ఓ తెల్ల కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. అయితే బాలిక కిడ్నాప్ సమాచారం అందుకుని వెంటనే దర్యాప్తు ప్రారంభించి కేవలం మూడు గంటల్లోనే ఆమెను రక్షించామని తెలిపారు. పోర్వోరిమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బివ్బా దాల్వీ నేతృత్వంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది.

బాధిత బాలికను కిడ్నాప్ చేసిన నిందితులలో ఒకరు మైనర్ బాలుడు ఉండగా అతడ్ని రాష్ట్ర జువెనైల్ హోమ్ కు తరలించామని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. మరో నిందితుడు షబ్బీర్ బాబాసాహెబ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు వివరించారు. సోమవారం సాయంత్రం ఆ యువతిని ఇంటి సమీపంలోని ఓ ప్రాంతానికి రమ్మని ఫేస్ బుక్ ఫ్రెండ్స్ పిలిచారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఆ బాలిక తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.  

ఇన్స్పెక్టర్ బివ్బా దాల్వీ టీమ్ వెంటనే రంగంలోకి దిగి బాధిత బాలిక ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత మందిని ప్రశ్నించగా, ఇద్దరితో ఆ ప్రాంతంలో చూసినట్లు చెప్పారు. వెంటనే ఆ యువతి ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఫొటోలు ప్రింట్ తీసి చూపించగా ఇద్దరు యువకులను గుర్తించారు. పోలీసులు టెక్నాలజీ సహాయంతో బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరి ఫోన్ నెంబర్, ఇతర నెట్ వర్క్ లు వినియోగించి వారిని కనిపెట్టారు. బాలికను గోవా మెడికల్ హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. బాలికను కార్లో తీసుకెళ్తుండగా తాము నిందితును అదుపులోకి తీసుకున్నామని ఇన్స్పెక్టర్ వివరించారు.

మరిన్ని వార్తలు