మైనర్ బాలికనురేప్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు

3 Jan, 2015 02:26 IST|Sakshi
  • యూపీ పోలీస్ స్టేషన్‌లో కీచకపర్వం
  • బదాయూ (యూపీ): ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌రేప్‌ల పరంపరలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. ఈసారి రక్షక భటులే కామాంధులైపోయారు. పోలీస్ స్టేషన్లోనే 14 ఏళ్ల బాలికను ఇద్దరు కానిస్టేబుళ్లు రేప్ చేశారు. అదీ ఆ బాలికను ఆమె ఇంటి నుంచి ఎత్తుకొచ్చి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులు వీర్ పాల్ సింగ్ యాదవ్, అవినాశ్ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు శుక్రవారం తెలిపారు.

    గతేడాది డిసెంబర్ 31న ఆ బాలికను ముసాజ్‌హగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి.. ఆ కానిస్టేబుళ్లు ఆక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బదాయూ(సిటీ) ఎస్పీ లలాన్ సింగ్ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశామని, కానిస్టేబుళ్లనిద్దరినీ సస్పెండ్ చేశామని చెప్పారు. బాధితురాలి చెప్పిన వివరాల మేరకు.. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ బాలిక బయటకు వచ్చిన సమయంలో కారులో వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెను కారు ఎక్కాల్సిందిగా ఆదేశించారు.

    తర్వాత ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ ఒక గదిలో బంధించి అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను తీసుకొచ్చి ఆమె ఇంటి వద్ద వదిలివెళ్లారు. కాగా, పోలీసులే ఇలాంటి దారుణాలు చేస్తే ప్రజల్ని కాపాడేదెవరని కేంద్ర మంత్రి మేనకాగాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదేశించారు.
     

మరిన్ని వార్తలు