బోనులో మైనర్లు

1 May, 2018 21:54 IST|Sakshi

లైంగికదాడుల కేసుల్లో పెరిగిపోతున్న ప్రమేయం

అత్యాచార కేసుల్లో  మైనర్లు నిందితులుగా ఉన్న  కేసులు ఏడాది ఏడాదికి పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటనలో ఒక మైనర్‌ కూడా ఉండడం అప్పట్లో తీవ్ర సంచలనమే కలిగించింది. అప్పట్నుంచి లైంగిక దాడుల కేసుల్లో మైనర్ల ప్రమేయం ఎక్కువైపోయిందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో అత్యాచారం, హత్య వంటి కేసుల్లో 16–18 వయసు ఉన్న వారు కూడా మేజర్ల కిందకి తీసుకువస్తూ ది జువైనల్‌ జస్టిస్‌ చట్టానికి సవరణలు చేశారు. చట్టాలు ఏ పని ఎలా చేస్తున్నా పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని వారు అత్యంత హేయమైన నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు వేధిస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)ప్రకారం అత్యాచారం కేసుల్లో మైనర్లు నిందితులుగా ఉన్న కేసులు 1991–2016 మ«ధ్య 11 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి.  2016 సంవత్సరంలో మైనర్లు నిందితులుగా ఉన్న రేప్‌ కేసుల్లో ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 

రాష్ట్రం                మైనర్లు నిందితులుగా ఉన్న అత్యాచారం కేసులు
మధ్యప్రదేశ్‌                   442 (23.2%)
మహారాష్ట్ర                    258  (13.6%)
రాజస్థాన్‌                     159  (8.4%)
ఢిల్లీ                            155  (8.1%)
ఛత్తీస్‌గఢ్‌                     148  (7.8%)
ఉత్తరప్రదేశ్‌                   126  (6.6%)
ఒడిశా                         122  (6.4%)
పశ్చిమ బెంగాల్‌              77  (4.0%)
హర్యానా                        62  (3.3%)
తెలంగాణ                       54  (2.8%)

మైనర్లు ఎన్ని నేరాలు చేశారు, ఎలా చేశారు అన్నదే కాకుండా ఎందుకు చేశారో కూడా తెలుసుకొని వారిలో మార్పు తీసుకురావడానికి కృషి జరగాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల్ని పరిరక్షించే ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ హెచ్‌ఎక్యూ కో డైరెక్టర్‌ గంగూలీ అభిప్రాయపడ్డారు. అందులోనూ 16–18 ఏళ్ల మధ్య వయసు అత్యంత ప్రమాదకరమైనది. శారీరకంగా మార్పులు వస్తాయి కానీ మానసిక పరిపక్వత అంతగా ఉండదు. విచక్షణా జ్ఞానం అసలే కనిపించదు. ఆ వయసులో తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం, చుట్టూ నెలకొని ఉన్న పరిస్థితుల ప్రభావంతో వారు చేస్తున్న నేరాలే అధికంగా ఉంటున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

నేరం                 నేరాల సంఖ్య       12 కంటే తక్కువ     12–16 వయసు       16–18 వయసు
                                                (నేరం శాతాల్లో)
లైంగిక దాడి             1627                 0.6                   20.2                        79.2
అత్యాచారం              2054                 1.4                   22.6                        76.0
అత్యాచార యత్నం        73                 2.7                   24.7                        72.6
అసహజ నేరాలు         218                 3.7                   42.2                        54.1
మహిళల్ని అవమానపరచడం   94        1.1                   29.8                        69.1
మొత్తం లైంగిక నేరాలు  4066               1.2                  22.9                        75.9

మరిన్ని వార్తలు