అభినందన్‌ ఎఫ్‌-16 విమానాన్ని కూల్చాడు: మింటీ అగర్వాల్‌

16 Aug, 2019 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ: వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేయడాన్ని తాను చూసినట్లు స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మింటీకి ‘యుద్ధ్‌ సేవా’ పతకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు పొందనున్న తొలిమహిళ రక్షణ అధికారి మింటీనే కావడం విశేషం.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘అభినందన్‌ వర్ధమాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేయడం నా స్క్రీన్‌ నుంచి చూశాను. ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాను. బాలాకోట్‌ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపాం. శత్రువులను నుంచి స్పందన వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. పాక్‌ దాడి చేస్తే.. తిప్పి కొట్టేందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. అపాయం తలపెట్టే దురుద్దేశంతోనే పాక్‌ విమానం భారత గగన తలంలోకి ప్రవేశించింది. కానీ అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే సరికి వారి మిషన్‌ ఫెయిలైంది’ అని తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్‌ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్‌ కూడా కూలిపోవడంతో అభినందన్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్‌ సైనికులకు అప్పగించారు. మూడు రోజుల తర్వాత పాక్‌ అభినందన్‌ను విడిచిపెట్టింది. దాయది చెరలో ఉన్నప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ వర్ధమాన్‌కు కేంద్రం ‘వీర్‌ చక్ర’ ప్రకటించారు.

మరిన్ని వార్తలు