అలా అద్భుతం జరిగిపోయింది!

28 Oct, 2016 09:34 IST|Sakshi
అలా అద్భుతం జరిగిపోయింది!

మానవత్వంపైనా.. ప్రస్తుత సమాజంపైనా కొంతమందిలో అపోహలు అలాగే ఉండిపోయాయి. ఏరోజుకు ఆరోజు మారిపోయే పత్రికల హెడ్డింగులు చూసి దేశం ఎక్కడికి వెళ్లిపోతోందో అని బాధపడిపోయే తలకాయలూ ఉన్నాయి. ఎక్కడా అవినీతే తప్ప.. మంచితనం, మంచి మనుషులు మచ్చుకైనా కనిపించడం లేదని వాపోయే కొంతమందికి ఊరట కలిగించడానికా అన్నట్టు గతేడాది మన దేశంలో ఓ అద్భుతం జరిగిపోయింది. ఇప్పటికి తలచుకున్నా అది అద్భుతంగానే ఉంటుంది!

2015 ఆగస్టు 8.. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరిసరాల్లో దారి తప్పి తిరుగుతున్నారు ఇద్దరు తల్లీకూతుళ్లు. తల్లి పేరు తంగపొన్ను, కుమార్తె పేరు స్వాతి. బీఎస్సీలో చేరేందుకు కౌన్సెలింగ్‌ కోసం యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక తెలిసింది వారికి.. కౌన్సెలింగ్‌ చెన్నైలో కాదు కోయంబత్తూర్‌లో అని! అంతే.. వారి గుండెలు బద్దలయ్యాయి. స్వాతి కన్నీటిధారలు ఆగడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ అమ్మాయి.

తెల్లవారు జాము ఆరున్నర గంటలు కావస్తోంది. కొంతమంది వ్యాయామం కోసం యూనివర్సిటీ గ్రౌండ్‌లోకి వచ్చారు. స్వాతిని, తంగపొన్నుని చూశారు. దగ్గరకు చేరి ఏమైందో ఆరా తీశారు. జరిగిందంతా వారికి అర్థమైంది. స్వాతి రికార్డులు పరిశీలించారు.

బ్రిలియంట్‌ స్టూడెంట్‌! ఆ అమ్మాయి కెరీర్‌ నాశనం కాకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ వ్యక్తి తన కారులో వారిని విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. తన సొంత డబ్బులతో వారిని కోయంబత్తూర్‌ ఫ్లైట్‌ ఎక్కించాడు. వారు మార్గమధ్యంలో ఉండగా మరికొందరు కోయంబత్తూర్‌లోని రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. జరిగినదంతా చెప్పారు.

రిజిస్ట్రార్‌ మనసు కూడా కరిగిపోయింది. కానీ, ముందురోజే కౌన్సెలింగ్‌ ముగిసిపోయిందని, మరో గంటలో చేరుకోగలిగితే తాను చేయాల్సింది చేయగలనని ఆయన చెప్పాడు. ఉదయం 7.50లోగా రిజిస్ట్రార్‌ దగ్గరకు చేరుకోవాలి. దీంతో స్వాతి, తంగపొన్ను విమానం దిగగానే వారికోసం కొందరు వాహనాలతో కాపలా కాశారు. అనుకున్న సమయానికే అక్కడకు చేరుకునేలా చేశారు. రిజిస్ట్రార్‌ కూడా ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచడంతో స్వాతికి అడ్మిషన్ దొరికింది. అంతే.. ఆ నిరుపేద కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. గొర్రెల కాపరిగా జీవితం గడుపుతోన్న తంగపొన్ను తన కుమార్తెకు సీటు లభించడం చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఇది కాదంటారా అద్భుతమంటే..!!                                                                                           

మరిన్ని వార్తలు