మిరాకిల్‌ బేబి: ఆరు సార్లు హార్ట్‌ స్ట్రోక్‌

11 May, 2017 10:16 IST|Sakshi
మిరాకిల్‌ బేబి: ఆరు సార్లు హార్ట్‌ స్ట్రోక్‌

ముంబై: నాలుగు నెలల వయసున్న విదిషను ముంబైలోని ఓ ఆసుపత్రిలోని వారంతా 'మిరాకిల్‌ బేబి'గా పిలుస్తున్నారు. అందుకు కారణం ఓ అరుదైన వ్యాధి నుంచి బేబి మృత్యుంజయురాలిగా బయటపడటమే. విదిషకు 45 రోజుల వయసున్నప్పుడు వాంతి చేసుకుని అన్‌కాన్సియస్‌లోకి వెళ్లి పోయింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు వైశాఖ, వినోద్‌లు విదిషను గట్టిగా ఊపడంతో ఆమె మేల్కొని మళ్లీ అన్‌కాన్సియస్‌లోకి వెళ్లి పోవడంతో కంగారుపడి స్ధానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

వైద్యుడి సూచనతో బీజే వాడియా ఆసుపత్రికి పాపను తరలించారు. విదిషకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గుండె సాధరణ స్ధితికి వ్యతిరేకంగా పని చేస్తోందని చెప్పారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి గుండెకు ఆపరేషన్‌ నిర్వహించారు. ఇక్కడి నుంచి మరింత కఠినమైన పరిస్ధితిని ఎదుర్కొంది విదిష.

ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత విదిష ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెట్టసాగాయి. శరీరంలోని రక్తానికి మూడోంతుల ఆక్సిజన్‌ అవసరమైతే కేవలం ఒక వంతు మాత్రమే ఆక్సిజన్‌ను అందించడం ప్రారంభించాయి. కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్ధాయి రక్తంలో మూడోంతులకు పెరగడంతో విదిషకు ఆరు సార్లు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది.

దాదాపు 51 రోజుల పాటు ఐసీయూలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ఒకానొక సమయంలో 15 నిమిషాల పాటు విదిష గుండెను కృత్రిమంగా కొట్టుకునేలా చేయాల్సివచ్చిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం విదిష పూర్తిగా కోలుకుందని మరో రెండు రోజుల్లో బేబిని డిస్‌చార్జ్‌ చేస్తామని చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు